న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల వేలం ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ వేదికగానే ఈ మెగా ఆక్షన్ నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
వాస్తవానికి ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని జనవరి తొలి వారంలో నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కానీ లీగ్‌లోకి కొత్తగా వచ్చిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న సీవీసీ ఓనర్షిప్ అంశాన్ని తేల్చేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ కమిటీ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఇది తేలేవరకు మెగా ఆక్షన్ డేట్స్ ఫైనలైజ్ అయ్యే చాన్స్ లేదు. ఇక ముగ్గురు ప్లేయర్లతో కాంట్రాక్ట్ చేసుకునేందుకు అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలకు మరింత టైమ్ ఇవ్వాల్సి ఉంటుంది' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
అయితే జనవరి తొలి వారంలో సీవీసీ ఓనర్షిప్ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతోనే ఫిబ్రవరి మొదటి వారంలో వేలం నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భావించిందని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు. బెంగళూరు లేదా హైదరాబాద్‌లో ఈ మెగా వేలం నిర్వహించాలనుకుంటున్నారని సదరు అధికారి వెల్లడించారు.
లీగ్‌లోకి వచ్చిన కొత్త జట్లలో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంచైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు గోయెంక గ్రూప్‌కు చెందిన ఆర్పీఎస్జీ సొంతం చేసుకుంది. దాంతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు కీలక ఘట్టమైన ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియను బీసీసీఐ ముగించింది. అంచనాలకు అనుగుణంగానే ఈ రిటెన్షన్ ప్రక్రియ సాగింది. సుదీర్ఘ కాలంగా తమ విజయాల్లో భాగంగా ఉన్న కొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు నమ్మకం పెట్టుకోగా, మరికొందరిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనసాగించేందుకు సిద్దపడ్డాయి. టీమ్‌కు నలుగురి చొప్పున 32 మందికి అవకాశం ఉన్నప్పటికీ ఎనిమిది టీమ్స్ కలిపి 27 మంది ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకున్నాయి.
వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్లలలో నుంచి కొత్త జట్లు ముగ్గురిని నేరుగా ఎంచుకునే అవకాశం ఉంది. అహ్మదాబాద్ శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌ను తీసుకుందని, లక్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్‌లను తీసుకున్నట్లు తెలుస్తోంది.