
మరో నెల రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అభిమానులకు ముంబై అసోసియేషన్ త్వరలోనే ఓ శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లకు 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించే ఆలోచనలో ఉంది. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించే విషయమై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఇందులో భాగంగానే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో 25 శాతం ప్రేక్షలకులను మైదానాల్లోకి అనుమతించాలనే ఆలోచనలో ఉందని సమాచారం. ఇటీవల రాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రేతో భేటీ అయినా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు దీనిపై చర్చించారు. ఈ భేటీల్లో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించడానికి మంత్రి అంగీకరించారు.
ఇటీవల కాలంలో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజు వారి కేసుల సంఖ్య 1000 లోపల నమోదవుతుండగా.. గత 24 గంటల్లో వైరస్‌తో ఇద్దరు మాత్రమే మరణించారు. 2020 నుంచి ఇప్పటివరకు మహారాష్ట్రలో నమోదైన అత్యల్ప కరోనా కేసులు ఇవే. కాగా ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లు అన్నింటిని ముంబై, పుణేలోని 4 వేదికలలో నిర్వహించనున్నారు. లీగ్ స్టేజ్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి.
వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మొత్తం 55 లీగ్-స్టేజ్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మిగిలిన 15 లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు పూణెలోని ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి. కాగా ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ఇంకా వేదికలను ఖరారు చేయలేదు. అయితే ప్లేఆఫ్ మ్యాచ్‌లతోపాటు ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
మరోవైపు ఐపీఎల్ 2022 కోసం జట్లన్నీ సిద్ధం అవుతున్నాయి. ఈ సారి లీగ్‌లో 10 జట్లు పాల్గొననున్నాయి. దీంతో ఐదేసి జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విడదీసి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గ్రూపు ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఇక గ్రూపు బీలో చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి. కాగా ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది.