
బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలానికి సర్వం సిద్దమైంది. ఈ శనివారం, ఆదివారం రెండు రోజులపాటు వేలం జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేలాన్ని నిర్వహించనున్నారు. అయితే వేలానికి ఏ జట్టు వద్ద ఎన్ని డబ్బులు మిగిలి ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మెగా వేలానికి అత్యదికంగా పంజాబ్ కింగ్స్ వద్ద 72 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ జట్టు వేలానికి ముందు ఇద్దరిని మాత్రమే రిటెన్షన్ జాబితాలో చేర్చుకుంది. ఆ తర్వాత అత్యధికంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద ఉన్నాయి. వేలంలో ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న రైజర్స్ వద్ద ఇంకో 68 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి.
ఇక ఆ తర్వాత అత్యధిక డబ్బులు ఉన్న జాబితాలో మూడో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఉంది. ఆ జట్టు ఖాతాలో 59 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉంది. ఆ జట్టు ఖాతాలో 57 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఐదో స్థానంలో 52 కోట్ల రూపాయలతో అహ్మదాబాద్ టైటాన్స్ ఉంది. ఆరో స్థానంలో 48 కోట్ల రూపాయలతో ముంబై ఇండియన్స్, చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఉన్నాయి. అన్నీ ఫ్రాంచైజీల కంటే తక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద 47.5 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ జట్టు మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. కాగా ఒక్కో జట్టుకు ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి మొత్తం 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే సంగతి తెలిసిందే.
ఇక మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 370 మంది భారత్‌కు చెందిన ఆటగాళ్లు ఉండగా, విదేశాలకు చెందిన ఆటగాళ్లు 22ం మంది ఉన్నారు. కాగా నిజాని వేలానికి ముందు 1200 వందలకుపైగా ఆటగాళ్లు రిజిష్టర్ చేసుకున్నారు. కానీ బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసి తుది జాబితాలో వేలానికి 590 మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచింది. దీంతో వీరిలో ఎంత మంది అమ్ముడుపోతారనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.