
చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో చోటు విషయమై భద్రతా భావం లభించిందని, అందుకే అతను ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడని ఆ జట్టు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చెప్పాడు. కాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడంలో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ గురించి కీలక విషయాలను అక్షర్ పటేల్ వివరించాడు.
ఐపీఎల్‌లో గతంలో కుల్దీప్ యాదవ్ కోల్‌కతానైట్ రైడర్స్ తరఫున ఆడాడు. ఆ సమయంలో అతనికి తుది జట్టులో చోటు విషయమై భరోసా లేకుండా పోయిందని అక్షర్ పటేల్ అన్నాడు. ముఖ్యంగా అని మ్యాచ్‌లు ఆడతానని అతనికే నమ్మకం లేకున్నదని చెప్పుకొచ్చాడు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చిన తర్వాత అతను అన్ని మ్యాచ్‌లు ఆడాతాడని భరోసా కల్పించినట్లు తెలిపాడు.
జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తోపాటు కెప్టెన్ రిషబ్ పంత్ కూడా కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు విషయమై భరోసా ఇచ్చినట్లు అక్షర్ పటేల్ చెప్పాడు. ప్రాక్టీస్ సెషన్‌లో కూడా తామంతా అతనికి అండగా ఉన్నామని చెప్పాడు. ఏ ఆటగాడికైనా జట్టులో సుస్థిర స్థానం ఉంటుందని భరోసా ఇస్తే అతను కచ్చితంగా రాణిస్తాడని, అలా కాకుండా పదే పదే పక్కన పడితే సరైన ప్రదర్శన ఇవ్వలేరని అన్నాడు. అందుకే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడని అక్షర్ పటేల్ చెప్పాడు. ఇక 178 పరుగుల లక్ష్య చేధనలో తాము ఏ క్రమంలోనూ ఆశలు వదులుకోలేదని, తమ కోచ్ కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిపాడు. దీంతో చివరి వరకు పోరాడి విజయం సాధించామని అక్షర్ పటేల్ చెప్పాడు.
కాగా ఐపీఎల్‌లో కుల్దీప్ యాదవ్ 2016 నుంచి కోల్‌కతానైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే గత రెండేళ్లుగా అక్కడ అతనికి సరైన అవకాశాలు దక్కలేదు. 2020లో 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా.. 2021లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే ఈ సారి కుల్దీప్ యాదవ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ మెగా వేలంలోకి వదిలేయగా ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.