
ముంబై: టీమిండియా స్టార్ ప్లేయర్, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కేప్టెన్ కేఎల్ రాహుల్ పెళ్లిపై తాజా అప్‌డేట్స్ వచ్చేసింది. త్వరలోనే అతను పెళ్లిపీటలు ఎక్కబోతోన్నాడు. ఈ సంవత్సరమే ఓ ఇంటివాడు కానున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ ఆతియా షెట్టిని పెళ్లాడనున్నాడీ కన్నడిగుడు. ఈ సంవత్సరం చివర్లో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోనున్నారు. దీనికి కేఎల్ రాహుల్-ఆతియా షెట్టి కుటుంబాల వారు అంగీకరించినట్లు తెలుస్తోంది.
కేఎల్ రాహుల్.. కొంతకాలంగా బాలీవుడ్ హీరోయిన్ ఆతియా షెట్టితో ప్రేమలో ఉంటోన్నాడు. నాలుగైదు బాలీవుడ్ సినిమాల్లో నటించిందామె. 2015లో హీరో మూవీతో అరంగేట్రం చేసింది. అనంతరం ముబారకన్, నవాబ్జాదె, మోతీచూర్ ఛక్నాచూర్ మూవీల్లో మెరిసింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో సునీల్ షెట్టి కుమార్తె. సునీల్ షెట్టిది తుళు ఫ్యామిలీ. మంగళూరు కొప్పళ సమీపంలోని ముల్కీ వారి స్వస్థలం. అనంతరం బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో సునీల్ షెట్టి ముంబైలో స్థిరపడ్డాడు.
కేఎల్ రాహుల్ స్వస్థలం కూడా మంగళూరే. అతనితో పెళ్లికి రెండు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది చివరిలో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారు. దీనిపై వచ్చిన వార్తలను సునీల్ షెట్టి కుటుంబం తోసిపుచ్చట్లేదు. ఈ నెల 18వ తేదీన కేఎల్ రాహుల్ తన 30వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నాడు. ఆతియా షెట్టి నుంచీ అతనికి విషెస్ అందాయి. అతనితో కలిసి దిగిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఆతియా షెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఐపీఎల‌్‌లో కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తోన్నాడు. ఈ సీజన్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. అనంతరం టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ టోర్నమెంట్ ముగిసిన తరువాత కేఎల్ రాహుల్.. పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి.