

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనకు ఎప్పటికీ స్ఫూర్తి అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి సచిన్‌ను ఫాలో అవుతున్నట్లు చెప్పాడు. సచిన్ సాధించిన అద్భుతాలను దగ్గరి నుంచి చూశానని చెప్పిన రోహిత్ శర్మ.. దేశం కోసం టీమిండియాను సచిన్ టెండూల్కర్ 25 ఏళ్లపాటు తన భుజస్కంధాలపై మెశాడని కొనియాడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని సంవత్సరాలు జట్టుకు ప్రాతినిధ్యం వహించడం సాధారణ విషయం కాదని అన్నాడు. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా సచిన్‌ను తాను ఎప్పుడూ ఫాలో అవుతానని రోహిత్ శర్మ చెప్పాడు.
క్రికెట్‌లోనే కాకుండా మైదానం బయట కూడా సచిన్ మానవతా దృక్పథంతో ఉండడం అద్భుతమంటూ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ దిగ్గజంగా పేరు గాంచిన వ్యక్తి ఇలా వినయ విదేయతతో ఉండడం కష్టంతో కూడుకున్నదని, కానీ దానిని సచిన్ చేసి చూపించాడని అన్నాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండగా.. సచిన్ టెండూల్కర్ మెంటార్‌గా ఉన్నాడు.

గతంలో క్రికెట్ ఆడినన్నీ రోజులు సచిన్ టెండూల్కర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో సచిన్ 6 సీజన్లపాటు ఆడాడు. కాగా ప్రస్తుత సీజన్లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇంకా తొలి విజయాన్ని నమోదు చేయలేదు. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.
ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్) , జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రీవిస్, బాసిల్ థంపి, ఎం అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, ఎన్ తిలక్ వర్మ, సంజయ్ యాదవ్, జోఫ్రా ఆర్చర్, డేనియల్ సామ్స్, టైమల్ మిల్స్, రిలీ, టిమ్ డేవిడ్, మెరెడిత్, మహ్మద్ అర్షద్ ఖాన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, రమణదీప్ సింగ్, రాహుల్ బుద్ధి, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, ఫాబియన్ అలెన్, ఆర్యన్ జుయల్.