వరుస వికెట్లు..
కేప్టెన్ మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. గాయం కారణంగా ఆడట్లేదు. ఈ మ్యాచ్‌కు శిఖర్ ధవన్ నాయకత్వాన్ని వహిస్తున్నాడు. మయాంక్ స్థానంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. శిఖర్ ధవన్‌తో కలిసి ఇన్నింగ్‌ను ఆరంభించాడు. వీరిద్దరూ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. 10 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది పంజాబ్. వరుసగా వికెట్లు పడటం మొదలైందక్కడే.
అలవాటైన రీతిలో చెలరేగిన లియామ్
మిడిల్ ఆర్డర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్-మహ్మద్ షారుఖ్ ఖాన్ మధ్య మాత్రమే చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఏర్పడింది. 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు వీరిద్దరూ. ఇదే లేకపోతే- పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ మరింత దయనీయంగా తయారై ఉండేది. లివింగ్ స్టోన్ తనకు అలవాటైన రీతిలో చెలరేగిపోయాడు. ఎప్పట్లాగే దూకుడుగా ఆడాడు. 33 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, అయిదు ఫోర్లు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 28 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
డెత్ ఓవర్లలో ఫైర్..
డెత్ ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరిగారు. అసాధారణ రీతిలో పెర్ఫార్మ్ చేశారు. సమష్టిగా సత్తా చాటారు. చివరి అయిదు ఓవర్లల్లో 19 పరుగులు మాత్రమే చేయగలిగారు పంజాబ్ బ్యాటర్లు. భువనేశ్వర్ కుమార్ తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఇది అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్. 2018 తరువాత ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లను తీసుకోవడం ఇదే తొలిసారి.
చివరి ఓవర్‌లో నో రన్స్..
సన్‌రైజర్స్ ఇన్నింగ్‌లో హైలైట్‌గా చెప్పుకోదగ్గది- చివరి ఓవర్. స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మలిక్ దీన్ని సంధించాడు. ఈ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదతను. ఈ ఒక్క ఓవర్‌లోనే నాలుగు వికెట్లు పడటం అంటే మాటలు కాదు. ఈ ఓవర్ రెండో బంతికి ఒడియన్ స్మిత్ బలి అయ్యాడు. భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. అది ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఉమ్రాన్ దాన్ని అందుకున్నాడు. నాలుగో బంతికి రాహుల్ చాహర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
గాల్లోకి లేచిన బెయిల్స్..
ఉమ్రాన్ సంధించిన బంతి వేగానికి బెయిల్స్ గాల్లోకి లేచాయి. అయిదో బంతి కూడా అదే రేంజ్‌లో పడింది. వైభవ్ అరోరాను బలి తీసుకుంది. రాహుల్ చాహర్ అవుట్ అయిన దానికి రీప్లేనా అనిపించింది. చివరి బంతికి అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ అయ్యాడు. 200 పరుగులు చేసేలా కనిపించిన పంజాబ్ కింగ్స్ జట్టు.. 151 పరుగుల వద్ద చతికిలపడటానికి ప్రధాన కారణం బౌలర్లే. ఆ స్థాయిలో వారి బౌలింగ్ పదును ఇవ్వాళ్టి మ్యాచ్‌లో దర్శనం ఇచ్చింది.

కావ్యా డెసిషన్ కరెక్ట్..
మెగా వేలం పాట సందర్భంగా స్టార్ బ్యాటర్లు, బౌలర్లను వదిలేసినందుకు అప్పట్లో అభిమానులు కావ్యా మారన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నాసిరకం టీమ్‌ను సమకూర్చుకుందంటూ మండిపడ్డారు. బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ వంటి సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను గెలిపించే బ్యాటర్లను వదిలేసిందంటూ విమర్శించారు. బౌలింగ్‌తో నెట్టుకొచ్చే ప్రయత్నం చేసిందనీ భగ్గుమన్నారు. ఆమె అంచనాలు ఇప్పుడు నిజం అయ్యాయి. బౌలర్లు చెలరేగిన తీరు చూస్తోంటే ఆమె డెసిషన్ కరెక్టేననిపించింది.


Click it and Unblock the Notifications
