
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో ఇది మూడో విక్టరీ. హ్యాట్రిక్ విజయాలను అందుకుందీ జట్టు. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లోకల్ టీమ్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లోనూ ఘోరంగా ఓడింది రోహిత్ సేన. వరుసగా నాలుగు పరాజయాలను అందుకుంది. ఓటముల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సమవుజ్జీగా నిలిచింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధిస్తోన్న ఈ హ్యాట్రిక్ విజయాల్లో బౌలర్ల పాత్ర కీలకంగా మారిన విషయం తెలిసిందే. బౌలర్లందరూ సమష్టిగా, నిలకడగా రాణిస్తోన్నారు. తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తప్పితే.. మిగిలిన మూడింట్లోనూ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు షాక్ ఇచ్చారు. జట్టుకు వరుస విజయాలను అందించారు. కోల్‌కత నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లల్లో బౌలర్లు తడాఖా చూపారు. బౌలర్లు రాణించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరుగులేని విజయాలను అందుకుంటోంది.
అలాంటి జట్టుకు దిగ్భ్రాంతికర వార్త అందింది. ఆర్సీబీ ఫాస్ట బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను లీడ్ చేస్తోన్న హర్షల్ పటేల్.. ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది.అతని చెల్లెలు అర్చిత పటేల్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. ఆరోగ్యం కుదుటపడలేదు. మరింత విషమించడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో ఈ సమాచారం అందింది. దీనితో మ్యాచ్ ముగిసిన వెంటనే హర్షల్ పటేల్- ఇంటికి బయలుదేరి వెళ్లాడు.
గుజరాత్‌లోని సనంద్.. హర్షల్ పటేల్ స్వస్థలం. చాలాకాలం నుంచీ అతని కుటుంబం అమెరికాలో స్థిరపడింది. తండ్రి విక్రమ్ పటేల్, తల్లి దర్శన పటేల్, చెల్లెలు అర్చిత పటేల్ ఉన్నారు. అనారోగ్య కారణాలతో అర్చిత కన్నుమూశారు. ఎల్లుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన తరువాతి మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీ కొట్టనుంది. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. రెండు రోజుల్లోనే మ్యాచ్ ఉన్నందున.. హర్షల్ పటేల్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదు.