
82 పరుగులకే..
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్.. 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరోసారి రాణించాడు. 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మాథ్యూవేడ్, హార్దిక్ పాండ్యా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. డేవిడ్ మిల్లర్-26, రాహుల్ తెవాతియా-22 పరుగులు చేయడంతో గుజరాత్ స్కోర్ బోర్డుపై ఆ పరుగులైనా జమ అయ్యాయి. ఆ మాత్రం స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది లక్నో సూపర్ జెయింట్స్. 82 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో చేరుకుంటామనే ఒత్తిడిలో ఆడినట్టు కనిపించారు లక్నో జెయింట్స్ బ్యాటర్లు.

సమష్టి విజయం..
మ్యాచ్ ముగిసిన అనంతరం గుజరాత్ కేప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడారు. జట్టు విజయానికి గల కారణాలను వివరించాడు. జట్టు మొత్తం సమష్టిగా రాణించడం వల్లే ఈ గెలుపులు సాధ్యమయ్యాయని స్పష్టం చేశాడు. ఏ ఒక్క ప్లేయర్‌కో ఈ ఘనతను ఇవ్వదలచుకోలేదని పేర్కొన్నాడు. విజయాన్ని తలకెక్కించుకోవద్దనే విషయాన్ని తాను ప్లేయర్లకు ముందు నుంచీ చెబుతూ వస్తున్నానని, గెలిచిన మ్యాచ్‌ను కూడా ఓటమిగానే పరిగణించాలని సూచించానని చెప్పాడు.

రెండు మ్యాచ్‌లల్లో ఓటమితో..
వరుసగా రెండు మ్యాచ్‌లల్లో ఓటమి తమను బాధించిందని, అందులో నుంచి గుణపాఠాలను నేర్చుకున్నామని అన్నాడు. ఆ రెండింట్లో చేసిన తప్పులను సమీక్షించుకున్నామని, వాటిని పునరావృతం చేయకూడదని భావించామని వ్యాఖ్యానించాడు. పిచ్‌కు అనుగుణంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని తాము ముందుగా ప్లాన్ వేసుకున్నామని, దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేశామని హార్దిక్ పాండ్యా అన్నాడు. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి, బంతులను సరైన ప్లేస్‌లో సంధించాల్సి ఉంటుందని సూచించానని, తాను అనుకున్నదాని కంటే సమర్థవంతంగా బంతులు వేశారని చెప్పాడు.

జేసన్ హోల్డర్ వికెట్ కీలకం..
పవర్ ప్లేలో పేస్ బౌలర్లు బ్యాటర్లను నిలువరించగలిగారని, దాన్ని స్పినర్లు కొనసాగించారని ప్రశంసించాడు. టోర్నమెంట్ కీలక దశలో ఉన్నామని, ఇలాంటప్పుడు ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదనేది తమ ఉద్దేశమని అన్నాడు. గెలిచినా, ఓడినా దాన్ని సమంగా తీసుకున్నామని వ్యాఖ్యానించాడు. తాము ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యామని, అయినప్పటికీ.. లక్ష్యాన్ని సాధించేంత వరకూ విశ్రమించబోమని అన్నాడు. ఇకపై నెట్స్‌లో మరింత శ్రమించాల్సి ఉంటుందని చెప్పాడు. జేసన్ హోల్డర్ వికెట్ అత్యంత కీలకమైనదని, మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం అతనికి ఉందని పేర్కొన్నాడు. లెగ్గీ మీదుగా మిడిల్ స్టంప్స్‌కు బంతులను సంధించాలని బౌలర్లకు సూచించానని, ఆ వ్యూహం ఫలించిందని చెప్పాడు.


Click it and Unblock the Notifications












