

ముంబై: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు- తమ ప్రస్థానాన్ని ప్రారంభించాయి. తొలిసారిగా తలపడ్డాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సాగిన ఈ పోరు చివరి ఓవర్ వరకూ టెన్షన్ పెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయిదు వికెట్ల తేడాతో కేఎల్ రాహుల్ జట్టును ఓడించింది. గెలుపుతో తన ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించింది హార్దిక్ పాండ్యా టీమ్.
కృనాల్ 13 బంతుల్లో మూడు ఫోర్లతో 21 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. కేప్టెన్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్ మొట్టమొదటి బంతికే పెవిలియన్ దారి పట్టాడు. మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే బలి అయ్యాడు. ఇది కాస్తా జట్టుపై ఒత్తిడిని పెంచినట్టయింది. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న క్వింటన్ డికాక్, ఎవిన్ లెవిస్, మనీష్ పాండే పెవిలియన్‌కు వరుస కట్టారు. వెంటవెంటనే అవుట్ అయ్యారు. కేఎల్ రాహుల్ డకౌట్ కావడం ఆరు సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి.
2020 ఐపీఎల్ సీజన్‌లో 670 పరుగులను ఊదిపడేసిన బ్యాటర్ అతను. గత సీజన్‌లో కూడా అదే ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. సీజన్ మొత్తం మీద 626 పరుగులు చేశాడు. నిలకడగా రాణిస్తున్నాడు. అలాంటి బ్యాటర్ ఈ సీజన్‌లో తొలి బంతికే అవుట్ కావడం పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇదివరకు మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్.. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. పంజాబ్ కింగ్స్ దుస్థితి చూసి కూడా కేఎల్ రాహుల్‌ను తీసుకుని లక్నో సూపర్ జెయింట్స్ సాహసం చేసిందంటూ సెటైర్లు పడుతున్నాయి.