
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎదుర్కొనబోతోంది. సోమవారం సాయంత్రం 7:30 గంటలకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలోఈ మ్యాచ్ ఉంటుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధించిన ఘన విజయంతో మాంఛి ఊపు మీద ఉంది లక్నో. ఆ మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు సూపర్‌గా రాణించారు. అలాంటి జట్టును ఢీ కొట్టి సన్‌రైజర్స్ ఎలా నెగ్గుకొస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ దారుణంగా ఓడిపోయింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. 37 పరుగులకే అయిదు వికెట్లను పోగొట్టుకుంది. మిడిల్ ఆర్డర్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్, లోయర్ ఆర్డర్‌లో రొమారియో షెప్పర్డ్, వాషింగ్టన్ సుందర్ ఆదుకోకపోతే సన్‌రైజర్స్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారై ఉండేది. ఈ ఘోర పరాజయంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉందీ జట్టు.
కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, ఎవిన్ లెవిస్, దీపక్ హుడా వంటి ఆల్‌రౌండర్లు, పించ్ హిట్టర్లు ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచి, నిలుస్తుందని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. కేన్ విలియమ్సన్, నికొలస్ పూరన్, మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ వంటి బ్యాటర్లు ఉన్నప్పటికీ.. నిలకడ కనిపించట్లేదు. నికొలస్ పూరన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి ఇంకా ట్రాక్‌లో పడలేదు. కేన్ విలియమ్సన్ వివాదస్పదంగా అవుట్ కావడం జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది.

ఈ పరిస్థితుల్లో మరో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ జట్టుతో కలిశాడు. తొలి మ్యాచ్‌లో అతను అందుబాటులో లేడు. ఇవ్వాళే ముంబైకి చేరుకున్నాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడే తుదిజట్టులో అతను ఆడతాడా? లేదా? అనేది అనుమానమే. విశ్రాంతి కోసం ఈ మ్యాచ్‌లో తీసుకోకపోవచ్చు. విదేశీ ప్లేయర్ల కోటాలోకేన్ విలియమ్సన్, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్, రొమారియో షెప్పర్డ్ ఆడారు. వారిని కంటిన్యూ చేయడానికే మొగ్గు చూపొచ్చు. ఆ తరువాతి మ్యాచ్‌లో ఫిలిప్స్‌ను తీసుకునే అవకాశం ఉంది.