

ఐపీఎల్‌లో అమ్ముడు పోకపోతనేం, దిగ్గజ ఆటగాడు సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'స్పోర్ట్స్ ఐకాన్' అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కోసం 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీపడగా, చివరకు సురేష్ రైనాను వరిచింది. ఈ అవార్డు కోసం పోటీ పడిన వారిలో శ్రీలంక క్రికెట్ దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య, జమైకా స్ప్రింటర్ పోవెల్, డచ్ ఫుట్‌బాల్ ఆటగాడు ఎడ్గర్ డెవిడ్స్ తదితరులు ఉన్నారు.
ఈ నెల 17న మాల్దీవ్స్‌లోని సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మైదానంలో ఈ అవార్డుల వేడుక జరగగా.. బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ జహీర్ హసన్ రసెల్ చేతుల మీదుగా సురేష్ రైనా స్పోర్ట్స్ ఐకాన్ అవార్డును అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవుల స్పోర్ట్స్ మినిస్టర్లు సైతం పాల్గొన్నారు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయని సంగతి తెలిసిందే. అతని సొంత చెన్నై సూపర్ కింగ్స్ కూడా పట్టించుకోక పోవడం గమనార్హం. దీంతో మిస్టర్ ఐపీఎల్‌గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనా ఈ సీజన్‌లో కనిపించడు. అయితే రైనా ఆటగాడిగా కనిపించపోయినప్పటికీ కామెంటేటర్‌గా సందడి చేయనున్నాడు. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన హిందీ కామెంటరీకి సురేష్ రైనా ఎంపికయ్యాడు. రైనాతోపాటు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కూడా హిందీ కామెంట్రీకి ఎంపికయ్యాడు.
ఐపీఎల్‌లో సురేష్ రైనా 205 మ్యాచ్‌లు ఆడి 32 సగటుతో 5528 పరుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో రైనా 506 ఫోర్లు, 203 సిక్సులు బాదాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి సురేష్ రైనా ఇప్పటికే రిటైర్ అయిన సంగతి తెలిసిందే.