
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2022 క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ జోస్ బట్లర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై దండయాత్ర చేసి ఆర్ఆర్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. బట్లర్ సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ చేతిలో ఏడు వికెట్లు, 11బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించింది. ఈ విజయం ఫలితంగా రాజస్థాన్ ఐపీఎల్ 2022 ఫైనల్‌లో తమ స్థానాన్ని 2008ప్రారంభ సీజన్ తర్వాత బుక్ చేసుకుంది. నేడు ఇదే స్టేడియంలో ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.
రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర బట్లర్ బ్యాటింగ్‌ను కొనియాడాడు. ఈ సీజన్‌లో ఫ్రాంచైజీ కోసం బట్లర్ ఏమి చేశాడో చెప్పడానికి మాటలు రావట్లేదన్నాడు. టోర్నమెంట్ చరిత్రలో ఇంత బాగా బ్యాటింగ్ చేసిన బట్లర్ ప్రదర్శనను తాను మర్చిపోలేనని చెప్పాడు. అతను ఈ సీజన్ మొదటి భాగంలో ఎంతో చక్కగా రాణించాడు. రెండో హాఫ్‌లో కాస్త ఇబ్బందిపడ్డాడు. అయినా ఏమాత్రం నిరాశను అతను దరిచేరనీయలేదు. తనంతట తానుగా కామ్‌గా ఉంటూ పరిస్థితులను బాగా ఆకళింపు చేసుకున్నాడు.
కేవలం ప్రాక్టీసు పెంచడం ద్వారా వచ్చేదానికంటే కోచ్‌లు, మెంటర్లతో సలహాలు సూచనలు తీసుకునేలా సంభాషణలు జరిపేవాడు. ప్రతిరోజు గొప్పగా ఆడడం ఎవరి వల్ల కాదని, తాను కూడా ఓ మానవుడినేననే ధోరణితో సానుకూల మనస్తత్వాన్ని బట్లర్ కలిగి ఉన్నాడని, ఒకరోజు కాకపోతే మరో రోజైనా మనకు అనుకూలంగా ఉంటుందని బట్లర్ భావిస్తాడని, అదే అతను రాణించడానికి కారణమని సంగక్కర పేర్కొన్నాడు.
ప్రస్తుత ఐపీఎల్ 2022సీజన్లో బట్లర్ నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. టోర్నమెంట్ చరిత్రలో విరాట్ కోహ్లీ తర్వాత ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. ఇకపోతే ఐపీఎల్‌లో ఒకే ఎడిషన్‌లో 800 కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో బ్యాటర్ కూడా బట్లర్. ఇంతకు ముందు విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ 2016లో 800కు పైగా పరుగులు నమోదు చేశారు. ఇప్పటివరకు బట్లర్ ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 824పరుగులు చేశాడు. మరో 25పరుగులు చేస్తే బట్లర్ టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలుస్తాడు.