
అద్భుతంగా రాణిస్తోన్న సంజు సేన
సంజు శాంసన్ సారథ్యంలోని పింక్ టీమ్.. తొలి క్వాలిఫయర్‌లో తనను ఓడించిన గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోంది. తొలి క్వాలిఫయర్‌లో విజయం సాధించి సగర్వంగా ఫైనల్స్‌కు ఎంట్రీ ఇచ్చింది గుజరాత్. ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా రాణించింది. భారీ స్కోర్లతో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడింది. టోర్నమెంట్ ఆరంభంలో తొలి రెండు మ్యాచ్‌లల్లో భారీ విజయాలను అందుకుంది. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ.. ఆ పరాజయం భారం నుంచి త్వరగా కోలుకుంది. రెండో క్వాలిఫయర్‌లో టైటిల్ హాట్ ఫేవరెట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టికరిపించింది.

జోస్..జోష్
ఓపెనర్ జోస్ బట్లర్ జోష్‌లో ఉన్నాడు. అతని దూకుడును అడ్డుకోవడం కష్టమే. ఈ సీజన్లో ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిందతనే. రెండో క్వాలిఫయర్లోనూ సెంచరీ బాది అవతల పడేశాడు. ఫైనల్లోనూ భారీ స్కోర్ చేస్తాడనే అంచనాలు అతని మీద ఉన్నాయి. యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజువేందర్ చాహల్ వంటి టాప్ క్లాస్ బ్యాటర్లు, బౌలర్లు రాజస్థాన్‌కు అలవోకగా విజయాలను అందిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫామ్‌లో ఉండటం కలిసి వచ్చింది.

కొత్త రికార్డు..
ఆడిన తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్.. ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. కప్‌పై కన్నేసింది. అది కూడా సాధించగలిగితే- అదో కొత్త రికార్డు. ఐపీఎల్ టోర్నమెంట్ తొలి ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌తో.. ఈ తొలి జట్టు ఢీ కొట్టబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. లీగ్ దశ మొత్తంపైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది హార్దిక్ పాండ్యా టీమ్. 14 మ్యాచ్‌లల్లో ఓడింది నాలుగే. టేబుల్ టాపర్‌గా నిలిచింది.

ఆ రెండు మార్పులకు ఛాన్స్..
రాజస్థాన్ రాయల్స్ జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. విజయాలను అందిస్తోన్న జట్టుతోనే గుజరాత్‌ను ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ మాత్రం ఒక్క మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా రాణించట్లేని వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మాథ్యూ వేడ్‌ను పక్కన పెట్టొచ్చని తెలుస్తోంది. అలాగే- బౌలర్లు అల్జారీ జోసెఫ్.. లోకీ ఫెర్గూసన్లల్లో ఎవరిని తుదిజట్టులోకి తీసుకోవాలో తేేల్చుకోలేకపోతోంది. తొలి క్వాలిఫయర్‌లో లోకీ ఫెర్గూసన్‌ను తీసుకోలేదు. అల్జారీ జోసెఫ్ భారీగా పరుగులు ఇవ్వడం మైనస్ పాయింట్. గుజరాత్ టైటాన్స్‌లో ఈ మార్పులు ఉండొచ్చు.

తుదిజట్టులో..
రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టులో- జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టెన్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కే, యజువేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్‌లో- శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మాథ్యూవేడ్, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిశోర్, యష్ దయాళ్, లోకీ ఫెర్గూసన్/అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ ఆడొచ్చు.