
టీ20 సిరీస్ కోసం సన్నద్ధం
ఇవ్వాళ్టితో ఐపీఎల్ మెగా టోర్నమెంట్ ముగిసిపోయిందంటూ క్రికెట్ ప్రేమికులు బాధపడాల్సిన అవసరం లేదు. సరిగ్గా 10 రోజుల్లో టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆరంభం కాబోతోంది. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రాబోతోంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్ ఇది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.
రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది. 17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ.

ఇంగ్లాండ్ సిరీస్ సైతం..
ఈ టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్ పర్యటన కూడా మొదలవుతుంది. ఈ రెండింటి కోసం వేర్వేరు జట్లను కూడా బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. టీ20 జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యాన్ని వహించనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (వైస్ కేప్టెన్-వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రన్ మలిక్‌ను తీసుకుంది.

టెస్ట్ జట్టులో..
టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ సారథ్యాన్ని వహిస్తాడు. కేఎల్ రాహుల్‌ను వైస్ కేప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. మొత్తం టెస్ట్ జట్టులో రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కేప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చేతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజ, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఎంపికయ్యారు.

నో బయో బబుల్..
కాగా- దక్షిణాఫ్రికా సిరీస్ కోసం సమాయాత్తమౌతున్న టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ తీపి కబురు వినిపించింది. ఇకపై బయో బబుల్ వ్యవస్థ ఉండబోదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని- ప్లేయర్లు ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి బయో బబుల్ వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది. 2020 ప్రారంభంలోనే దీన్ని అమలు చేసింది. రెండున్నరేళ్లుగా ప్లేయర్లు ఇందులోనే ఉంటున్నారు. మ్యాచ్ ఆరంభానికి ముందు క్వారంటైన్ కాలాన్ని సైతం గడపాల్సి వచ్చింది. దీనివల్ల మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు.

ఇక స్వేచ్ఛ..
ఈ బయో బబుల్ బందీఖానా నుంచి ప్లేయర్లకు విముక్తిని కల్పించింది బీసీసీఐ. దక్షిణాఫ్రికాతో ఆరంభం అయ్యే సిరీస్ నుంచి బయో బబుల్ ఉండబోదని తేల్చి చెప్పింది. బీసీసీఐ కార్యదర్శి జయ్ షా- ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. బయో బబుల్ నుంచి బయటికెళ్లినప్పటికీ.. కోవిడ్ పరీక్షలను మాత్రం జరిపించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారాయన. బయో బబుల్‌కు.. ఐపీఎల్ 2022 సీజన్ చిట్టచివరిదని తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications












