
ఐపీఎల్ 2022లో రవీంద్ర జడేజాను తమ కెప్టెన్‌గా నియమించి చెన్నైసూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తప్పు చేసిందని టీమిండియా మాజీ హెడ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. జడేజాకు బదులుగా సౌతాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లిసెస్‌ను జట్టులో ఉంచుకుని అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సిందని అన్నారు. అసలు డుప్లిసెస్‌ను సీఎస్కే వదులుకుని ఉండాల్సింది కాదని చెప్పారు.
ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు ఆ బాధ్యతలను డుప్లిసెస్‌కు అప్పగించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు జడేజాపై ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదని, తన సహజసిద్ధమైన ఆటను ఆడే వాడని అన్నారు. ఇలా చేసి ఉంటే ప్రస్తుతం ఐపీఎల్ 2022లో చెన్నైసూపర్ కింగ్స్ పరిస్థితి మరోలా ఉండేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
కాగా ఐపీఎల్ 2022 మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుందనే సమయంలో మహేంద్ర సింగ్ ధోని చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని అందరికీ షాకిచ్చాడు. దీంతో ఆ జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను నియమించారు. కానీ సీఎస్కే కెప్టెన్‌గా రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా రాణించలేకపోతున్నాడు.
అతని కెప్టెన్సీలో సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఒక్క విజయం కూడా లేకుండా పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా కూడా రవీంద్ర జడేజా రాణించలేకపోతున్నాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సీఎస్కేకు ఈ పరిస్థితి రావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ధోని కెప్టెన్సీలో ఓ వెలుగు వెలిగిన చెన్నైసూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ ట్రోఫి గెలిచిన సంగతి తెలిసిందే.
అదే సమయంలో మెగా వేలంలో ఫాఫ్ డుప్లిసెస్‌ను 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని జట్టు కెప్టెన్‌గా నియమించింది. అతడి కెప్టెన్సీలో సత్తా చాటుతున్న ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉంది. కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ డుప్లిసెస్ రాణిస్తున్నాడు. దీంతో ఈ సారి ట్రోఫి గెలిచే జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఫెవరేట్‌గా ఉంది.