కోల్‌కతా: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యువ ప్లేయర్ రజత్ పటీదార్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. క్రీజులోకి రజత్ పటీదార్.. కోహ్లీతో కలిసి అద్భుతంగా ఆడాడు. ఓవైపు విరాట్ నిదానంగా ఆడినా.. మరోవైపు పటీదార్ చెలరేగాడు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. భారీ షాట్లు కొట్టాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ఔటైనా అదే జోరును కొనసాగించిన పటీదార్.. కృనాల్ వేసిన 11వ ఓవర్ క్విక్ సింగిల్ తీసి 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇక ఆ వెంటనే గ్లేన్ మ్యాక్స్‌వెల్ కూడా ఔటవ్వగా.. పటీదార్ ఆర్సీబీ బ్యాటింగ్ బాధ్యతలను మోసాడు. ఈ క్రమంలోనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి విరాట్.. పటీదార్‌కు సూచనలు చేశాడు. స్ట్రాటజిక్ టైమ్ ఔట్లో మైదానంలోకి వెళ్లి మరీ అతనితో చర్చించాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ నుంచి సైగలతో విరాట్ సలహాలు ఇస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 14.3 ఓవర్లలో ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.