
ఇవ్వాళే ఎలిమినేటర్..
ఇక మరో హైఓల్టేజ్ మ్యాచ్ చూడబోతున్నాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2022 ఎలిమినేటర్‌లో తలపడనున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఉంటుంది. ఇందులో ఓడిన జట్టు ఇంటికే. నాకౌట్ తరహా మ్యాచ్ ఇది. తొలి క్వాలిఫయర్‌లో ఉన్న రెండో ఛాయిస్ ఇందులో ఉండదు. గెలిచిన జట్టు- రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఢీకొట్టాల్సి ఉంటుంది.

ఆర్సీబీపై ఫోకస్..
ఆరంభం నుంచి ఐపీఎల్‌లో కొనసాగుతూ ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్లల్లో రాయల్ ఛాలెంజర్స్ ఒకటి. ఈ సాల కప్ నమ్దే అంటూ ప్రతీసారీ ఎన్నో ఆశలు పెట్టుకుని టోర్నమెంట్‌లోకి రావడం.. నిరాశతో వెనుదిరగడాన్ని చవి చూసింది. ఐపీఎల్ కప్ ఎగరేసుకెళ్లడానికి ఇప్పుడు మరో అవకాశం లభించిందా జట్టుకు. ఎనిమిదో సారి ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. నాలుగో స్లాట్ కింద ఎంట్రీ ఇచ్చింది. ఈ సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. అందరి దృష్టీ ఆర్సీబీపైనే నిలిచింది.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..
తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇప్పుడు మరో అవకాశం లభించింది. ఛాంపియన్‌గా ఆవిర్భవించడానికి మూడు అడుగుల దూరం నిలిచింది. ఇవ్వాళ్టి ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేయగలిగితేనే- ఫైనల్స్‌లో అడుగు పెట్టగలుగుతుంది. వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్స్‌లో ఓడించగలిగితే- ఈ సాల కప్ నమ్దే అవుతుంది. దీనికోసం వరుసగా మూడు మ్యాచ్‌లను ఆర్సీబీ గెలవాల్సి ఉంటుంది మరి.

హర్షల్ పటేల్ గాయం ఆందోళన..
ఈ పరిణామాల మధ్య హర్షల్ పటేల్ స్వల్పంగా గాయపడటం ఆర్సీబీని ఆందోళనకు గురి చేస్తోంది. అతని కుడిచేతికి చిన్న వెబ్బింగ్ ఇంజ్యూరీ అయింది. ఆ వెబ్బింగ్ తీవ్రమైనది కాదని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ చెబుతోంది. వచ్చేనెలలో ఆరంభం కానున్న దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు హర్షల్ పటేల్ ఎంపిక అయినందున- దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మ్యాచ్‌కు దూరం అవుతాడనే అభిప్రాయాలు లేకపోలేదు. హర్షల్ పటేల్ ఆడకపోతే- అతని స్థానంలో ఆకాశ్ దీప్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

లక్నోలో ఉత్సాహం..
ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన తొలి సీజన్‌లోనే ప్లేఆఫ్స్‌లో ఎంట్రీ ఇవ్వడం లక్నో సూపర్ జెయింట్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. అదే ఊపుతో ఎలిమినేటర్‌ను గెలవలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. లీగ్ దశలో ఆడిన చివరి మూడు మ్యాచ్‌లల్లో రెండింట్లో ఓడిపోవడం ఆ జట్టును కొంత గందరగోళానికి గురి చేస్తోంది. ఓపెనర్ క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, మార్కస్ స్టొయినిస్.. కాక మీద ఉండటం లాభించే విషయమే.

తుదిజట్ల అంచనాలిలా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు- ఫాప్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్/ఆకాశ్ దీప్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌లో క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కేప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, అవేష్ ఖాన్, దుష్మంత చమీర, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications












