
వేలం సమయంలో విమర్శలు
ఐపీఎల్ 2022 మెగా వేలంలో కావ్య మారన్ అనుసరించిన వ్యూహాలపై అంతటా విమర్శలు వ్యక్తమయ్యాయి. వేలంలో సరైన టీంను కొనుగోలు చేయలేదంటూ దుమ్మెత్తి పోశారు. అనామక ఆటగాళ్ల కోసం కోట్ల రూపాయలు తగలేసిందని వ్యాఖ్యానించారు. ఒక్క స్టార్ ఆటగాడిని కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. మంచి మంచి ఆటగాళ్లు వేలంలోకి వచ్చినప్పుడు సప్పుడు చేయకుండా కూర్చుందని విమర్శించారు. గతంలో సన్‌రైజర్స్‌కు ఉన్న మంచి మంచి ఆటగాళ్లను కూడా తిరిగి కొనుగోలు చేయకుండా.. ఇతర టీంలకు వదిలేసిందని వ్యాఖ్యానించారు. టీంలో అంతా బౌలర్లే ఉన్నారని, బహుషా బౌలర్లతో మ్యాచ్‌లు గెలవాలనుకుంటుందేమోనని విమర్శించారు. ఇక ఈ సారి కూడా పాయింట్ల టేబుల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిట్టచివరన నిలవడం ఖాయమని అభిమానులు, నెటిజన్స్ మండిపడ్డారు.

కావ్యకు జ్యోతిష్యం తెలుసు
కానీ నెల రోజులు కూడా గడవక ముందే సీన్ రివర్స్ అయింది. నాడు దారుణంగా విమర్శించిన వాళ్లే నేడు కావ్య మారన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగా వేలంలో కావ్య కొనుగోలు చేసిన జట్టే సరైనదని వ్యాఖ్యానిస్తున్నారు. బహుషా కావ్యకు జ్యోతిష్యం తెలిసి ఉంటుందని, అందుకే భవిష్యత్‌లో ఏ ఆటగాడు ఎలా ఆడబోయేది ఆమెకు ముందే తెలిసిందని కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. దానికి తగ్గట్టే జట్టును కొనుగోలు చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే అప్పుడు చెత్త ఆటగాళ్లుగా భావించిన వారు ఇప్పుడు చెలరేగుతున్నారని అంటున్నారు. మెగా వేలం సమయంలో బలహీనంగా కనిపించిన సన్‌రైజర్స్, కావ్య వ్యూహాలతో ప్రస్తుతం బలంగా కనిపిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతా కావ్య మారన్ జ్యోతిష్యం పుణ్యమే అంటూ నెటిజన్లు రాసుకొస్తున్నారు.

చెలరేగుతున్న పూరన్
అయితే ప్రస్తుతం కావ్య మారన్‌పై ఇలాంటి ప్రశంసలు కురవడానికి క్రికెట్‌లో ఇటీవల జరిగిన సంఘటనలే కారణంగా చెప్పవచ్చు. అందులో మొదటిది ఏంటంటే.. మెగా వేలంలో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ అత్యధికంగా 10 కోట్ల 75 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ సమయంలో పూరన్ ఫేలవ ఫామ్‌లో ఉన్నాడు. గత సీజన్లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించి అంతగా రాణించలేకపోయాడు. దీంతో అలాంటి ఆటగాడి కోసం అనవసరంగా కోట్ల రూపాయలు తగేలిసిందని అభిమానులు మండిపడ్డారు. కానీ ఇంతలోనే సీన్ రివర్స్ అయింది. మెగా వేలంలో భారీ ధర దక్కడంతో వచ్చిన ఉత్సాహమో ఏమో కానీ ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో, లీగ్ క్రికెట్‌లో పూరన్ చెలరేగుతున్నాడు. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌పాటు టీ10 లీగ్‌ల్లో దుమ్ములేపే ఆటతో సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. టీ10 లీగ్‌లో అయితే 37 బంతుల్లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. దీంతో పూరన్‌ను కొనుగోలు చేసి కావ్య మారన్ మంచి పని చేసిందని అభిమానులు ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఫాంలోకి భువి
ఇక వేలం సమయంలో ఫేలవ ఫామ్‌లో ఉన్న భువనేశ్వర్ కుమార్‌ను సన్‌రైజర్స్ 4 కోట్ల 20 లక్షల రూపాయలకు మళ్లీ కొనుగోలు చేసింది. కానీ తాజాగా భువనేశ్వర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. టాప్ ఫామ్‌తో చెలరేగుతున్నారు. డెత్ ఓవర్లలో కచ్చతమైన బంతులు వేస్తూ ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్‌లో కీలకమైన 19వ ఓవర్ వేసిన భువి 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా తీసి భారత్‌ను గెలిపించాడు. దీంతో సన్‌రైజర్స్ బౌలింగ్ సమస్య తీరిపోయిందని చెప్పుకోవాలి.

తప్పుకున్న రాయ్
అలాగే గత సీజన్లో రైజర్స్‌కే ఆడిన ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను వేలంలో సన్‌రైజర్స్ కొనుగోలు చేయలేదు. దీంతో మంచి ఓపెనర్ అయినా రాయ్‌ను సన్‌రైజర్స్ అనవసరంగా వదిలేసిందని విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా రాయ్ ఐపీఎల్ 2022 నుంచి తప్పుకున్నాడు. దీంతో వేలంలో సన్‌రైజర్స్ రాయ్‌ను కొనుగోలు చేయకపోవడమే మంచిది అయిందని విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. అందుకే సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌కు భవిష్యత్‌లో ఏం జరగబోతుందో ముందే తెలిసిపోయిందని, ఆమెకు జ్యోతిష్యం కూడా తెలిసి ఉంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2022
కేన్ విలిమ్సన్(రూ.14 కోట్లు) , అబ్దుల్ సమద్(రూ.4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్(రూ.4 కోట్లు), వాషింగ్టన్ సుంధర్(రూ.8.75 కోట్లు), నికోలస్ పూరన్(రూ. 10.75 కోట్లు), నటరాజన్(రూ.4 కోట్లు), భువనేశ్వర్ కుమార్(రూ.4.2 కోట్లు), ప్రియామ్ గార్గ్ (రూ. 20 లక్షలు), రాహుల్ త్రిపాఠి(8.50 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.6.50 కోట్లు), కార్తీక్ త్యాగీ (రూ.4 కోట్లు), జగదీష సుచిత్(రూ.20 లక్షలు), శ్రేయస్ గోపాల్(రూ. 75 లక్షలు), ఎయిడెన్ మార్క్‌రమ్(రూ.2.60 కోట్లు), మార్కో జాన్సెన్(రూ.4 కోట్లు), రొమారియో షెఫెర్డ్(రూ.7,75 కోట్లు).


Click it and Unblock the Notifications
