
ముంబై: ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్.. తీవ్ర దుమారాన్ని రేపింది. వివాదాస్పదంగా మారింది. అంపైరింగ్ వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చిందీ మ్యాచ్‌తో. అంపైర్ నిర్ణయాన్ని నిరసిస్తూ మ్యాచ్ కొనసాగుతుండగానే- ఢిల్లీ కేపిటల్స్ కేప్టెన్ రిషభ్ పంత్ జట్టును రీకాల్ చేసే స్థితికి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. మరోసారి జట్టు స్కోరును 200లను దాటించిందా మ్యాచ్‌లో. రెండు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 65 బంతుల్లో 116 పరుగులు చేశాడు.
భారీ స్కోర్ నుంచి భయపడలేదు ఢిల్లీ కేపిటల్స్. చివరి వరకూ పోరాడింది. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, కేప్టెన్ రిషభ్ పంత్, లలిత్ యాదవ్, లోయర్ ఆర్డర్‌లో రౌమన్ పావెల్.. పట్టు వదల్లేదు. చివరి బంతి వరకూ పోరాడారు. అయినప్పటికీ.. అది సరిపోలేదు. 207 పరుగుల వద్దే నిలిచిపోయింది ఢిల్లీ కేపిటల్స్ ప్రస్థానం. 15 పరుగుల తేడా ఓడిపోయింది. చివరి ఆరు బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో రౌమన్ పావెల్ ఒక్కసారిగా విరుచుకు పడ్డాడు.
మెక్ కాయ్ వేసిన ఆ ఓవర్‌లో తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీనితో ఒక్కసారిగా మ్యాచ్ ఢిల్లీ వైపునకు మొగ్గేలా కనిపించింది. నాలుగో బంతిని నడుం కంటే ఎత్తుకు సంధించడంతో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ దాన్ని నో బాల్‌గా ప్రకటిస్తాడని భావించారు. అలా జరక్కపోవడంతో ఢిల్లీ ప్లేయర్లు నిరసన వ్యక్తం చేశారు. అది నోబాల్ అని.. ఛాతీ మీదికి బంతి దూసుకొచ్చిందంటూ పావెల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంపైర్‌తో వాదించాడు. అంపైర్ దీనికి అంగీకరించకపోవడంతో డగౌట్‌లో ఉన్న రిషబ్ పంత్ అసహనానికి గురయ్యాడు. ఇంకా బంతులు మిగిలి ఉన్నప్పటికీ.. వెనక్కి వచ్చేయండంటూ చేతులు ఊపాడు.
ఈ మ్యాచ్‌ను హోటల్ గదిలో టీవీలో చూశాడు హెడ్ కోచ్ రికీ పాంటింగ్. కరోనా వైరస్ పాజిటివ్ అయిన పాంటింగ్ ప్రస్తుతం హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంటున్నాడు. అక్కడి నుంచే మ్యాచ్ చూశాడు. అతను కూడా అసహనానికి గురయ్యాడు. ఆ కోపాన్ని, అసహనాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. మ్యాచ్ చూస్తూ 3-4 టీవీ రిమోట్లను పగొలగొట్టాడట. తన ఎదురుగా ఉన్న బాటిళ్లను గోడకేసి విసిర కొట్టాడట. ఈ విషయాన్ని పాంటింగ్ స్వయంగా వెల్లడించాడు.
మ్యాచ్ చూస్తూ ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యానని పాంటింగ్ చెప్పాడు. అలాంటి కీలకమైన సమయంలో కోచ్‌గా తాను జట్టుతో పాటు లేకపోయానని, అది తలచుకుంటే తన మీద తనకే కోపం వచ్చిందని అన్నాడు. హోటల్ నుంచి తాను జట్టును సమన్వయం చేసుకున్నానని చెప్పాడు. ప్లేయర్లు ఏం చేయాలో.. ఏం చేయకూడదో చెబుతూ ప్రతి ఓవర్‌కూ టెక్స్ట్ మెసేజీలను పంపించానని వివరించాడు. ఇంకాస్త పోరాటపటిమను ప్రదర్శించి ఉంటే గెలిచి ఉండేవాళ్లమని వ్యాఖ్యానించాడు.