
ముంబై: ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ ముంగిట్లో రాజస్థాన్ రాయల్స్.. బోల్తా కొట్టింది. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ కన్‌ఫర్మ్ అనుకుంటున్న దశలో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. నవీముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చిత్తయింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో మట్టి కరిచింది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే కనీసం ఇంకో మ్యాచ్ వరకైనా రాజస్థాన్ రాయల్స్ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్-యశస్వి జైస్వాల్ భారీ భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. ఫస్ట్‌డౌన్‌లోకి దిగిన రవిచంద్రన్ అశ్విన్.. తన పని తాను చేసుకుంటూ పోయాడు. 38 బంతుల్లో సరిగ్గా అర్ధసెంచరీ చేసి వెనుదిరిగాడు. దేవ్‌దత్ పడిక్కల్ 48 పరుగులతో రాణించాడు. అయినప్పటికీ ప్రత్యర్థిని భయపెట్టేంత భారీ స్కోర్ మాత్రం చేయలేకపోయింది రాజస్థాన్ రాయల్స్.
లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. దుమ్ము దులిపింది. రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, వన్‌డౌన్ బ్యాటర్ మిఛెల్ మార్ష్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు. ప్రత్యేకించి- మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 62 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్సర్లు, అయిదు ఫోర్లు ఉన్నాయి. జట్టు స్కోర్ 144 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ 41 బంతుల్లో ఒక సిక్సర్, అయిదు ఫోర్లతో మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఓడిపోవడానికి సంజు శాంసన్ కారణాలను వెల్లడించాడు. దురదృష్టం వెంటాడిందని వ్యాఖ్యానించాడు. ఇంకొన్ని పరుగులు చేయాల్సి ఉందని పేర్కొన్నాడు. కనీసం 15 పరుగులు తక్కువగా చేశామనిపించిందని చెప్పాడు. బ్యాటర్లు కొట్టిన కొన్ని షాట్లు ఫీల్డర్ల ముందుకొచ్చి పడ్డాయని, వాటిని క్యాచ్‌లుగా మలచుకోలేకపోయామని సంజుశాంసన్ అన్నాడు. స్టంపౌట్ కోసం ప్రయత్నించినప్పటికీ.. బెయిల్స్ కింద పడలేదని గుర్తు చేశాడు. మార్ష్ ఎల్బీడబ్ల్యూ విషయంలో బంతి బ్యాట్‌ను తాకిందని చెప్పుకొచ్చాడు.
మిగిలిన మ్యాచ్‌లల్లో గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని సంజు శాంసన్ భరోసా ఇచ్చాడు. ప్లేఆఫ్స్‌కు చేరుకుంటామని, మరింత ముందడుగు వేస్తామనే ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఓటమి నుంచి వెంటనే కోలుకుంటామని, లోపాలను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్‌లను ఎదుర్కొంటామని పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆడాల్సినవి రెండు మ్యాచ్‌లే. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాల్సి ఉందా టీమ్.