DC vs PBKS 2022: కరోనా దెబ్బ: రంగంలో దిగిన బీసీసీఐ: కీలక ప్రకటన

ముంబై: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మళ్లీ క్రమంగా విజృంభిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ఒక్కరోజు వ్యవధిలోనే 90 శాతం మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసుల కథ మళ్లీ మొదటికొస్తోన్నట్టే కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఫోర్త్ వేవ్‌కు దారి తీసే ప్రమాదం ఉందనే సంకేతాలు అందుతున్నాయి. అటు చైనా షాంఘైలో కోవిడ్ వల్ల మరణాలు సైతం సంభవిస్తోండటం ఆందోళనకు దారి తీస్తోంది.

ఢిల్లీ కేపిటల్స్‌లో కలకలం..
ఊహించినట్టే- కోవిడ్ ప్రభావం ఐపీఎల్ మ్యాచ్‌లపైనా పడింది. ప్రత్యేకించి ఢిల్లీ కేపిటల్స్ జట్టులో కోవిడ్ భయం ఆవరించింది. ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్ సహా అయిదు మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్ ఫర్హర్ట్, స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్ చేతన్ కుమార్, టీమ్ డాక్టర్ అభిజిత్ సాల్వి, సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్ ఆకాష్ మానె కోవిడ్‌కు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామాలతో ఢిల్లీ కేపిటల్స్ టీమ్, సపోర్టింగ్ స్టాఫ్ క్వారంటైన్‌లో ఉంటోంది.

పుణేకు వెళ్లని టీమ్..
షెడ్యూల్ ప్రకారం.. ఢిల్లీ కేపిటల్స్ జట్టు బుధవారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి వేదిక. దీనికోసం ముంబై టీమ్ పుణేకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ- దాన్ని రద్దు చేసుకుంది. క్వారంటైన్‌లో ఉంటోన్నందున పుణేకు వెళ్లలేదు. దీనితో ఢిల్లీ కేపిటల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌పై పలు అనుమానాలు తలెత్తాయి. రద్దవుతుందనే ప్రచారం సైతం సాగింది.

బీసీసీఐ కీలక నిర్ణయం..
ఈ అనుమానాలకు బీసీసీఐ తెర దించింది. మ్యాచ్‌ను పుణే నుంచి ముంబైకి తరలించింది. బ్రబౌర్న్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ఓ ప్రకటన విడుదల చేశారు. టెక్నికల్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బుధవారం నాటి మ్యాచ్ పుణేకు బదులుగా ముంబైలోని బ్రబౌర్స్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ఓటమికి తోడు..
ఈ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగట్లేదు. ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లను ఆడిన రిషభ్ పంత్ టీమ్.. రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిందీ జట్లు. తొమ్మిది, 10 స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ కలకలం రేపడం.. జట్టు ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications