
ముంబై: ఐపీఎల్ 2022 కీలక దశకు చేరుకున్న సమయంలో ఢిల్లీ కేపిటల్స్ ఒక్కసారిగా విజృంభించింది. చివరి అయిదు మ్యాచ్‌ల్లలో మూడింట్లో నెగ్గింది. రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించిన అనంతరం ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. నవీముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది ఢిల్లీ కేపిటల్స్. ఎనిమిది వికెట్ల తేడాతో జెండా ఎగురవేసింది. తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది.
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు జోస్ బట్లర్-యశస్వి జైస్వాల్ భారీ భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. ఫస్ట్‌డౌన్‌లోకి దిగిన రవిచంద్రన్ అశ్విన్.. తన పని తాను చేసుకుంటూ పోయాడు. 38 బంతుల్లో సరిగ్గా అర్ధసెంచరీ చేసి వెనుదిరిగాడు. దేవ్‌దత్ పడిక్కల్ 48 పరుగులతో రాణించాడు. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. దుమ్ము దులిపింది. రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

ఓపెనర్ డేవిడ్ వార్నర్, వన్‌డౌన్ బ్యాటర్ మిఛెల్ మార్ష్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు. ప్రత్యేకించి- మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 62 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్సర్లు, అయిదు ఫోర్లు ఉన్నాయి. జట్టు స్కోర్ 144 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ 41 బంతుల్లో ఒక సిక్సర్, అయిదు ఫోర్లతో మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో వార్నర్‌కు ఇది అయిదో అర్ధసెంచరీ.
డేవిడ్ వార్నర్‌తో పాటు ఇన్నింగ్‌ను ఆరంభించే పృథ్వీ షా కొన్ని మ్యాచ్‌లల్లో కనిపించట్లేదు. ఈ నెల 1వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా కనిపించాడీ డాషింగ్ ఓపెనర్. ఆ తరువాత ఏ మ్యాచ్‌లోనూ ఆడలేదు. అతను ఎందుకు ఆడట్లేదనడానికి ఇప్పటివరకు ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీ కారణాన్ని వెల్లడించలేదు. గాయం వల్ల తప్పుకొన్నాడనే ప్రచారం సాగింది. ఈ సస్పెన్స్‌కు కేప్టెన్ రిషభ్ పంత్ తెర దించాడు. అతని అనారోగ్యానికి గల కారణాన్ని వెల్లడించాడు.
పృథ్వీ షా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాడు. తాను డాక్టర్‌తో మాట్లాడానని, థైరాయిడ్- దాని సంబంధిత అనారోగ్యానికి గురైనట్లు వివరించాడు. పృథ్వీ షా జట్టుకు అందుబాటులో లేకపోవడం బాధాకరమే అయినప్పటికీ.. అది తమ చేతుల్లో లేదని వ్యాఖ్యానించాడు. అతన్ని తాము మిస్ అవుతున్నట్లు చెప్పాడు. మిగిలిన మ్యాచ్‌ల నాటికి జట్టుకు అందుబాటులోకి వస్తాడా? లేదా? అనే విషయంపై రిషభ్ పంత్ స్పష్టత ఇవ్వలేదు.