
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా హైఓల్టేజ్ మ్యాచ్ మంగళవారం రాత్రి ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజృంభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. వరుసగా నాలుగు పరాజయాల తరువాత అందిన తొలి గెలుపు ఇది. ఇలాంటి ఓ విజయం కోసం ఇన్ని రోజులూ ఎదురు చూశారు సూపర్ కింగ్స్ ఫ్యాన్స్. ఈ గెలుపు ఇచ్చిన ఊపుతో తన తరువాతి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టడానికి సమాయాత్తమౌతోంది.
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై కళ్లు చెదిరేలా ఆడింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప, టాప్ ఆర్డార్ బ్యాటర్ శివం దుబే ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డారు. మూడో వికెట్‌కు 165 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారంటే ఆ ఇద్దరి విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌లల్లో ఒక టీమ్ చేసే భారీ స్కోర్ ఇది. దీన్ని వారిద్దరే బాదేశారు. ఊతప్ప 50 బంతుల్లో 88, శివం దుబే 46 బంతుల్లో 95 పరుగులు చేశారు.
ఫలితంగా స్కోర్‌బోర్డ్‌పై 216 పరుగులు జమ అయ్యాయి. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి రాయల్ ఛాలెంజర్స్ పోరాడింది. చివరి వరకూ శ్రమించింది గానీ.. దాని ప్రయాణం లక్ష్యానికి 23 పరుగులు దూరంలో నిలిచి పోయింది. నిర్ణీత 20 ఓవర్లకు 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్లెన్ మ్యాక్స్‌వెల, షాబాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్.. పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. వరుసగా మూడు విజయాల తరువాత రాయల్ ఛాలెంజర్స్‌కు అందిన తొలి ఓటమి ఇది.
రెండు జట్లు కొదమ సింహాల్లా పోరాడిన ఈ మ్యాచ్ హయ్యెస్ట్ వ్యూవర్‌షిప్‌ను అందుకుంది. హాట్‌స్టార్‌లో 8.2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇన్ని లక్షల మంది ఈ మ్యాచ్‌ను తిలకించారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఇదే రికార్డ్. ఈ స్థాయిలో వ్యూస్‌ను దక్కించుకున్న మ్యాచ్ మరొకటి లేదు. నాలుగు మ్యాచ్‌లల్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పొందడం వల్ల ఇందులో ఎలా ఆడుతుందనే ఆసక్తి రేకెత్తించడం, రాబిన్ ఉతప్ప-శివందుబే విజృంభణ, లక్ష్య ఛేదనకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ చివరి వరకు పోరాడటం- వ్యూస్ పెరగడానికి కారణమైంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్-26, షాబాజ్ అహ్మద్-41, సుయాష్ ప్రభుదేశాయ్-34, దినేష్ కార్తీక్-34 పరుగులతో రాణించారు.