
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తన వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. మరో గెలుపును అందుకుంది. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో ఇది రెండో విజయం మాత్రమే. ఏడు మ్యాచ్‌లల్లో అయిదింట్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానం నుంచి ముందుకు కదల్లేకపోతోంది. అయినప్పటికీ- ముంబైపై సాధించిన విజయానికి ఉన్న ప్రత్యేకత వేరే లెవెల్. అయిదు మ్యాచ్‌లల్లో పరాజయాన్ని మరిపించిందీ గెలుపు.
చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన కేప్టెన్ రవీంద్ర జడేజాలో చివరి వరకూ అనుమానాలు నెలకొన్నాయట. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పాడు. మ్యాచ్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన అనంతరం రవీంద్ర జడేజా మాట్లాడాడు. మ్యాచ్ సాగుతున్న తీరు తనతో పాటు ప్లేయర్లందరినీ టెన్షన్‌కు గురి చేసిందని వ్యాఖ్యానించాడు. గెలుస్తామా? లేదా అనే ఆందోళన చివరి వరకు కొనసాగిందని పేర్కొన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ క్రీజ్‌లో ఉన్నాడనే ధైర్యం తమను కుదురుకునేలా చేసిందని చెప్పాడు.
ధోనీ వంటి ఓ అత్యుత్తమ ఫినిషర్ క్రీజ్‌లో ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదని తమను తాము సర్దిచెప్పుకొన్నామని అన్నాడు. ధోనీ క్రికెట్ ప్రపంచంలో ఓ బెస్ట్ ఫినిషర్, గేమ్ ఛేంజర్ అని రవీంద్ర జడేజా చెప్పాడు. దాన్ని అతను మరోసారి నిరూపించుకున్నాడని స్పష్టం చేశాడు. చివరి బంతి వరకూ ధోనీ క్రీజ్‌లోనే ఉంటే- తన స్టైల్‌లో మ్యాచ్‌ను ముగిస్తాడని గంపెడాశలు పెట్టుకున్నామని పేర్కొన్నాడు రవీంద్ర జడేజా.
జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని, ధోనీ క్రీజ్‌లో ఉన్నంతసేపు మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉంటుందనేది అందరికీ ఓ అంచనా ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ప్రశాంతంగా, రిలాక్స్డ్‌గా ఉండేవాళ్లమని రవీంద్ర జడేజా స్పష్టం చేశాడు. క్యాచ్‌లను జారవిడవటం పట్ల అతను స్పందించాడు. కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాల్సి ఉందని అన్నాడు. దీనిపై వర్కవుట్ చేస్తామనీ వ్యాఖ్యానించాడు. ప్రతి మ్యాచ్‌లోనూ క్యాచ్‌లను జారవిడవాల్సి రావడం సరికాదని పేర్కొన్నాడు.