
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు పరాజయాలు వీడట్లేదు. టోర్నమెంట్ ఆరంభమై ఇన్ని రోజులైనా ఒక్కటంటే ఒక్క గెలుపును కూడా అందుకోవట్లేదు. గత సీజన్ సహా నాలుగుసార్లు టైటిల్ విన్నర్‌గా నిలిచిన చెన్నై ఒక్క గెలుపు కోసం ఆరాటపడాల్సి వస్తోంది.. తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయినా విజయం మాత్రం వరించట్లేదు. మరోవంక ముంబై ఇండియన్స్ పరిస్థితీ ఇంతే. ఓటములను కొని తెచ్చుకోవడంలో ఈ రెండు టాప్ ఐపీఎల్ టీమ్స్ పోటీ పడుతున్నట్టు కనిపిస్తోన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్. 2010, 2011, 2018, 2021ల్లో విజేత ఆ జట్టే. పలుమార్లు రన్నరప్‌గా నిలిచింది. 2020లో తొలిసారిగా ప్లేఆఫ్స్‌కు కూడా వెళ్లలేకపోయింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైన తరువాత.. ఇప్పటిదాకా కోలుకోవట్లేదు. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఆ తరువాత పంజాబ్ కింగ్స్.. నాలుగో మ్యాచ్‌లో చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలోనూ మట్టి కరిచింది.
ఈ పరిణామాలపై జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పెదవి విప్పారు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లలో ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లను మరింత మెరుగుపర్చుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని సైతం తిరిగి పొందాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్లేయర్లలో వణుకు కనిపిస్తోందని వ్యాఖ్యానించార. ఎక్కడ లోపాలు ఉన్నాయో అర్థం కావట్లేదని, అయినప్పటికీ- టీమ్‌ను పునర్నిర్మించుకుంటామని చెప్పారు. అందుబాటులో జట్టు ప్లేయర్లు లేకపోవడం కూడా కొంత దెబ్బతీసిందని అంచనా వేశారు. కొంతమంది ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్లుగా ఆడట్లేదని, లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉందని చెప్పారు.
ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లను గెలవడం కాదు కదా.. కనీసం ఆ ప్రయత్నం కూడా చేసినట్లు కనిపించట్లేదని స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా మళ్లీ జట్టు ఆటతీరు గాడిన పడాల్సి ఉందని, దీనికోసం తక్షణ చర్యలకు దిగామని పేర్కొన్నారు. తన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శన పట్ల కేప్టెన్ రవీంద్ర జడేజా ఏ మాత్రం సంతోషంగా లేడని చెప్పుకొచ్చారు. టైటిల్ రేసులో నిల్చోవాలంటే అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ప్రతిభను కనపర్చాల్సి ఉందని అన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మరిన్ని పరుగులను చేయాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.