
ముంబై: క్రికెట్ ఆడే దేశాల్లో అత్యంత ధనిక బోర్డ్ ఏదైనా ఉందంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డే. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగం ద్వారా వచ్చే ఆదాయంలో 70 నుంచి 80 శాతం.. బీసీసీఐకి చేరుతోంది. అటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు పెద్దన్నలా వ్యవహరిస్తోంది. వారిపై పెత్తనం చలాయిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆరంభమైన తరువాత బీసీసీఐ.. తన పట్టు, ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది.
ఈ క్రమంలో ఐపీఎల్ ద్వారా వచ్చే రెవెన్యూను రెట్టింపు చేసుకునేలా బీసీసీఐ ప్రణాళికలను రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌తో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వెళ్లేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించే ప్రయత్నాల్లో ఉందని, దీనికోసం ఐసీసీ అనుమతిని తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఐపీఎల్ ద్వారా బీసీసీఐ అనూహ్య లాభాలను చవి చూస్తోన్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కొత్తగా అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీల వల్ల 8,000 కోట్ల రూపాయలకు పైగా అదనపు రెవెన్యూ బీసీసీఐ ఖజానాలో జమ అయింది. బీసీసీఐ నిర్దేశించిన బేస్‌ప్రైస్ కంటే ఈ రెండు జట్లు కూడా రెట్టింపు మొత్తాన్ని కోట్ చేస్తూ బిడ్డింగులను దాఖలు చేశాయి. లక్నో సూపర్ జెయింట్స్ పేరుతో ఆర్పీ-సంజీవ్ గోయెంకా, గుజరాత్ టైటాన్స్ పేరుతో సీవీసీ కేపిటల్స్ ఈ సీజన్‌లోనే కొత్త ఫ్రాంఛైజీలను ఏర్పాటు చేశాయి.
సీవీసీ కేపిటల్స్- 5,625 కోట్ల రూపాయలతో దీన్ని కొనుగోలు చేసింది. బీసీసీఐ నిర్దేశించిన బిడ్డింగ్ ప్రైస్ కంటే ఈ మొత్తం రెండున్నర రెట్లు అధికం. దీనితో ఈ సీజన్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. సాధారణంగా 60 మ్యాచ్‌లను ఆడాల్సిన చోట.. ఇక 74 వచ్చేశాయి. మ్యాచ్‌ల సంఖ్య పెరగడం వల్ల కూడా బీసీసీఐకి వచ్చే ఆదాయం రెట్టింపు అవుతుంది. కాసులకు రుచి మరిగిన నేపథ్యంలో- బీసీసీఐ ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రతి సంవత్సరం నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను పెంచుకుంటూ పోయేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై ఐసీసీతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఐసీసీ తన అంగీకారాన్ని తెలియజేస్తే.. వచ్చే సీజన్‌లోనే మ్యాచ్‌ల సంఖ్యను పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెరగడం వల్ల సంప్రదాయబద్ధమైన సిరీస్‌లు తగ్గుముఖం పట్టే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన క్రికెట్ ప్రేమికుల్లో వ్యక్తమౌతోంది.