ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడానికి స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే కరోనా దృష్యా 25% ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొంది. క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌ను ఆస్వాదించేందుకు మైదానంలోకి రావడానికి సర్వం సిద్ధం చేసినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులను స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొంది. అయితే మైదానంలోకి వచ్చే అభిమానులు కరోనా రూల్స్‌ను కచ్చితంగా పాటించాలని సూచించింది. మైదానంలోనూ కరోనా ప్రోటోకాల్స్ అమల్లో ఉంటాయని తెలిపింది. అలాగే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారినే మైదానంలోకి అనుమతించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

మరోవైపు టికెట్లు అమ్మకాన్ని కూడా బీసీసీఐ ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఐపీఎల్ అధికారిక వెబ్ సైట్ www.iplt20.com. తో పాటు BookMyShow యాప్‌లో కూడా టికెట్లను అందుబాటులో ఉంచినట్టు బీసీసీఐ వెల్లడించింది.
ఇక ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022కు సర్వం సిద్ధమైంది. మే 29 వరకు క్రికెట్ అభిమానులను అలరించనున్న ఈ లీగ్‌లో 10 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ముంబైలోని నాలుగు వేదికలలోనే మొత్తం లీగ్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ప్లేఆఫ్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉంది. లీగ్ మ్యాచ్‌లు, ప్లేఆఫ్ మ్యాచ్‌లు కలిపి ఐపీఎల్ 2022లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మహారాష్ట్రలోని వాంఖడే, డీవై పాటిల్, బ్రబోర్న్ స్టేడియాల్లో 55 లీగ్ మ్యాచులు జరుగనుండగా.. పూణెలోని ఎంసీఎ గ్రౌండ్‌లో 15 లీగ్ మ్యాచులు జరగనున్నాయి. ఇక ఈ నెల 26న జరగున్న తొలి మ్యాచ్‌లో గత సీజన్లో ఫైనల్ చేరిన కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి. కాగా గత 3 సీజన్ల మాదిరిగానే ఈ సారి కూడా కరోనా కారణంగా ఐపీఎల్‌కు సంబంధించిన ఓపెనింగ్ సెర్మనీ వేడుకులను నిర్వహించడం లేదు.