
ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న స్టేడియాల్లోకి 25 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్న బోర్డు ప్రస్తుతం ఆ సంఖ్యను 50 శాతానికి పెంచింది. ఏప్రిల్ 6 నుంచి స్టేడియాల్లోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతించినున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ నుంచి 50 శాతం ప్రేక్షకులు స్టేడియాల్లో సందడి చేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే టికెట్ల అమ్మకాన్ని సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది.
ముంబైలో కరోనా కేసులు తగ్గడంతో శనివారం నుంచి అక్కడ కరోనా నిబంధనలను ఎత్తి వేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బీసీసీఐ కూడా దానికి అనుగుణంగా స్టేడియాల్లోకి వచ్చే ప్రేక్షకుల సంఖ్యను 50 శాతానికి పెంచింది. కాగా ముంబైలోని బ్రబోర్న్, వాంఖడే, డీవై పాటిల్, పూణేలోని ఎంసీఎ స్టేడియాల్లో ఐపీఎల్ 2022 మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే.
కాగా కరోనా కారణంగా అనేక జాగ్రత్తలతో బీసీసీఐ ఐపీఎల్ 2022 నిర్వహిస్తోంది. లీగ్‌ను మొదట విదేశాల్లో నిర్వహించాలని భావించినప్పటికీ దేశంలో కరోనా కేసులు తగ్గడంతో ఇక్కడే నిర్వహిస్తోంది. అది కూడా ఎక్కువ ప్రాంతాలు, ఎక్కువ స్టేడియాల్లో కాకుండా కేవలం మహారాష్ట్రలోని 4 స్టేడియాల్లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలో నిర్వహించి.. అహ్మదాబాద్‌లో ప్లేఆఫ్స్, పైనల్ మ్యాచ్‌ను నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉంది. కాగా నేడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ కృష్ణ