
ఆర్సీబీలోకి పూరన్
ఈ సారి మెగా వేలంలో వెస్టిండీస్ బిగ్ హిట్టర్, స్టార్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌ను కొనుగోలు చేయాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భావిస్తోందని సమాచారం. మంచి బిగ్ హిట్టర్ అయినా లెప్ట్ హ్యాండర్ బ్యాటర్ కోసం వేలంలో ప్రయత్నిస్తామని ఆర్బీసీ తమ ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. గత 4, 5 సీజన్లలో తమకు మిడిల్ ఆర్డర్‌లో సరైన ఎడమ చేతి బ్యాటర్ లేడని అందుకే ఈ సారి ఆ స్థానంపై దృష్టి పెట్టినట్లు చెప్పింది.
ఈ క్రమంలో నికోలస్ పూరన్ కోసం వేలంలో గట్టిగా ప్రయత్నించాలని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుందట. మిడిలార్డర్‌లో పూరన్ ఉంటే భారీ షాట్లతో పరుగులు రాబట్టగలడు. ఈ విషయమై ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో పూరన్ నిరూపించుకున్నాడు. దీనికి తోడు మంచి వికెట్ కీపర్‌గా కూడా పూరన్ ఉపయోగపడతాడని ఆర్సీబీ భావిస్తోందట.

రిటెన్షన్ జాబితాలో నో ప్లేస్
గతేడాది పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన నికోలస్ పూరన్ రాణించలేకపోయాడు. 12 మ్యాచ్‌ల్లో కేవలం 85 పరుగులే చేశాడు. అదే 2019లో మాత్రమే 35 సగటుతో 353 పరుగులతో రాణించాడు. అయితే గత ఏడాది రాణించకపోవడంతో తమ రిటెన్షన్ జాబితాలో పూరన్‌కు పంజాబ్ కింగ్స్ చోటు కల్పించలేదు. మెగా వేలంలోకి వదిలేసింది. ఈ సారి పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్‌ను మాత్రమే రిటైన్ చేసుకుంది.

ధర ఎంతంటే?
గతేడాది నికోలస్ పూరన్‌కు పంజాబ్ కింగ్స్ 4 కోట్ల 20 లక్షల రూపాయలను చెల్లించింది. కాగా ఈ సారి వేలంలో పూరన్ 1.5 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు. దీంతో వేలంలో ఈ సారి పూరన్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. అతనికి 3 కోట్ల రూపాయల వరకు చెల్లించాలని నిర్ణయించుకుందని సమాచారం. అవసరమైతే మరిన్ని ఎక్కువ డబ్బులు కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

పూరన్ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు ఆడిన నికోలస్ పూరన్ 22 సగటుతో 606 పరుగులు చేశాడు. రెండు సార్లు హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగా.. అత్యధిక స్కోర్ 77 పరుగులు. 154 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 26 ఏళ్ల పూరన్ 36 ఫోర్లు, 44 సిక్సులు బాదాడు. నికోలస్ పూరన్ తన కెరీర్‌లో ఫోర్ల కంటే ఎక్కువగా సిక్సులే కొట్టడం గమనార్హం.


Click it and Unblock the Notifications












