
దేశాధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్
ఈ క్రమంలో దేశాధ్యక్షుడు గొటబొయ రాజపక్స పదవికి రాజీనామా చేయాలని లంకేయులు డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది నిరసనకారులు అధ్యక్షుడి రాజీనామాను కోరుతూ ఆయన ఇంటిని ముట్టడించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని గొటబొయ రాజపక్స పోలీసులతో నిరసనకారులను తరిమికొట్టించారు. కరోనా కారణంగా పర్యాటక రంగం దెబ్బతినడం, వారి వర్తక వ్యాపారం సాగకపోవడం, స్తోమతకు మించిన అప్పులు నేటి శ్రీలంక దారుణ స్థితికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

ఐపీఎల్‌లో ఆడుతున్నవారు నిరసనల్లో పాల్గొనాలి
శ్రీలంకలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా పలువురు ఆ దేశ క్రికెటర్లు ఐపీఎల్ 2022లో పాల్గొనడంపై లంక మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు అర్జున రణతుంగ తప్పుబట్టారు. ఈ క్రమంలో వారికి ఒక విజ్ఞప్తి కూడా చేశారు. ఐపీఎల్‌లో పాల్గొంటున్న శ్రీలంక ఆటగాళ్లంతా లీవ్‌పై వచ్చి దేశంలో జరుగుతున్న నిరసనల్లో వారం రోజులపాటు పాల్గొనాలని కోరారు. అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతుంటే, పలువురు క్రికెటర్లు మాత్రం తమకేం సంబంధం లేదని ఐపీఎల్‌లో పాల్గొంటున్నారని ఆయన మండిపడ్డారు. ఆ క్రికెటర్లంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ కాంట్రాక్టులు పోతాయని భయపడుతున్నారన్నారు. కాగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ దేశ మంత్రిత్వ శాఖ అధ్యర్యంలోనే ఉంటుంది. దీంతో అందులోని వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండకుండా తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికే చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో మద్దతిచ్చి ఇప్పుడెమో ఐపీఎల్ ఆడుతున్నారు
ఇప్పటికైనా సమయం మించి పోలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని శ్రీలంక ఆటగాళ్లను అర్జున రణతుంగ కోరారు. ఇప్పటికే అనేక మంది యువ క్రికెటర్లు ఆందోళనల్లో పాల్గొంటున్నారని, కావున ఐపీఎల్‌లో పాల్గొంటున్న వారు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వనిందు హసరంగ, బానుక రాజపక్స వంటి నిరసనలకు మద్దతుగా నిలిచారని కానీ ఇప్పుడేమో ఐపీఎల్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్న అందరి ఆటగాళ్ల పేర్లను తాను చెప్పదలుచుకోలేదని ఆయన అన్నారు.

అందుకే నేను నిరసనల్లో పాల్గొనడం లేదు
ఈ క్రమంలో నిరసనల్లో తానెందుకు పాల్గొనడం లేదనే అంశంపై కూడా రణతుంగా క్లారిటీ ఇచ్చారు. తాను 19 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, కానీ ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు పార్టీలకు అతీతంగా ప్రజలే చేస్తున్నారని అన్నారు. ఏ రాజకీయ నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొనడంలో లేదని అందుకే తాను కూడా దూరంగా ఉంటున్నట్లు అర్జున రణతుంగ చెప్పారు. ప్రజల పోరాటమే శ్రీలంకకు బలం అని ఆయన తెలిపారు. ఇక ఐపీఎల్‌లో శ్రీలంక చెందిన వానిందు హసరంగా, భానుక రాజపక్స, దుష్మంత చమీర, చమికా కరుణరత్నే, మహేశ్ తీక్షణ ఆయా జట్లలో ఆడుతున్నారు. అలాగే కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, లసిత్ మలింగ వంటి ఆటగాళ్లు పలు జట్ల కోచింగ్ బృందలో పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












