నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ ఆడేది ఎక్కడో బీసీసీఐ కార్యదర్శి తేల్చేశారుగా: ఆ డౌట్‌పై ఫుల్ క్లారిటీ

ముంబై: క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్గెస్ట్ ఈవెంట్స్‌లల్లో ఒకటి- ఇండియన్ ప్రీమియర్ లీగ్. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై కనకవర్షాన్ని కురిపించే టోర్నమెంట్ ఇది. దీని నిర్వహణ వల్ల వేల కోట్ల రూపాయలను చవి చూస్తుంటుంది బీసీసీఐ. జాతీయ క్రికెట్ జట్టుకు మెరికల్లాంటి ప్లేయర్లను అందించింది. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోంది. అక్టోబర్‌లో ఐపీఎల్ 2021 సీజన్ ముగిసింది. మరో ఆరునెలల్లో 15వ సీజన్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమౌతోంది.

రెండేళ్లుగా గందరగోళం..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో- గత రెండు సీజన్లుగా ఐపీఎల్ టోర్నమెంట్ల నిర్వహణ అనేది కొంత గందరగోళంలో పడుతూ వచ్చింది. ఐపీఎల్ 2020 సీజన్‌ను ముందుజాగ్రత్తతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు షిఫ్ట్ చేసింది బీసీసీఐ. ఈ ఏడాది సగం-సగం నిర్వహించాల్సి వచ్చింది. భారత్‌లో సగం, మిగిలిన షెడ్యూల్‌ను ఎమిరేట్స్‌లో పూర్తి చేయాల్సి వచ్చింది. ఫలితంగా- కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అప్పట్లో.

ఈ సారి ఫుల్ క్లారిటీ..
ఈ సారి ఆ తరహా పరిస్థితులు లేవు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత చాలావరకు తగ్గింది. రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు కాస్త అటు ఇటుగా రికార్డవుతున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. 115 కోట్ల మంది ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో ఇదివరకటి పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం సాధారణంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో- వచ్చే సంవత్సరం ఐపీఎల్ టోర్నమెంట్‌ను ఎక్కడ షెడ్యూల్ చేస్తారనే విషయం తేలిపోయింది.

జయ్ షా ఏం చెబుతున్నారంటే..?
వచ్చే సంవత్సరం ఐపీఎల్‌ను ఎక్కడ షెడ్యూల్ చేస్తారనే విషయంపై బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ఓ స్పష్టత ఇచ్చారు. స్వదేశంలోనే ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఇదివరకట్లా దేశం దాటబోదని స్పష్టంచేశారు. మ్యాచ్‌ల షెడ్యూల్స్, వేదికలు, ఇంకా ఖరారు కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సీజన్ ఫస్ట్ హాఫ్‌లో సెలెక్ట్ చేసిన స్టేడియాల్లోనే ఐపీఎల్ మ్యాచ్‌లు సాగాయి. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. స్టేడియాల సంఖ్యను పెంచే అవకాశం ఉంది.

మరింత రంజుగా..
ఐపీఎల్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ మరింత రంజుగా ఉంటుందని జయ్ షా ప్రామిస్ చేశారు. రెండు కొత్త ఫ్రాంఛైజీలు రాబోతోన్నాయని పేర్కొన్నారు. అహ్మదాబాద్, లక్నో కేంద్రాలుగా రెండు ఫ్రాంఛైజీలను బీసీసీఐ ఇదివరకే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీనీ సీవీసీ కేపిటల్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఇక ఆర్పీ- సంజీవ్ గోయెంకాకు చెందిన కంపెనీ.. లక్నో ఫ్రాంఛైజీని తీసుకుంది. దీనికోసం ఏకంగా 7,000 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఖర్చు చేసింది.

74 మ్యాచ్‌లు..
ఈ రెండు ఫ్రాంఛైజీలు రావడంతో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య మరింత పెరగనుంది. కనీసం 74 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఫైనల్‌తో కలుపుకొని 74 మ్యాచ్‌లు ఉండొచ్చు ఈ షెడ్యూల్‌లో మార్చి చివరి వారం నుంచి మే మూడో వారం వరకూ ఈ టోర్నమెంట్ కొనసాగొచ్చని సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications