అంతపెద్ద ఆటగాడు నాకు సలహాలివ్వడం అద్భుతంగా అనిపించింది: యువ బ్యాట్స్‌మన్

ముంబై: ఒమన్ పర్యటనకు వెళ్లే ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో ముచ్చటించడంతో పట్టరాని సంతోషంలో మునిగిపోయానని రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైశ్వాల్ అన్నాడు. అంతపెద్ద ఆటగాడు తనకు సలహాలివ్వడం అద్భుతంగా అనిపించిందన్నాడు. టీమిండియాకు ఆడడమే తన లక్షమని యశస్వి జైశ్వాల్ పేర్కొన్నాడు. ముంబై క్రికెట్ జట్టుతో కలిసి ఒమన్ టీమ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు యశస్వి జైశ్వాల్ అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు పలు కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఒమన్ జట్టు త్వరలో టీ20 ప్రపంచకప్ 2021 క్వాలిఫయర్ మ్యాచులు ఆడనుంది. సన్నాహక మ్యాచుల కోసం ముంబై జట్టుని అక్కడి పిలిచింది.
ఒమన్ పర్యటన తనకు ఐపీఎల్ 2021లో ఉపయోగపడుతుందని యశస్వి జైశ్వాల్ తెలిపాడు. 'ఒమన్‌లోని వాతావరణం యూఏఈలో లాగే ఉంటుంది. పిచ్‌లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఒమన్‌లో ఆడిన అనుభవం ఇప్పుడు ఐపీఎల్ 2021లో పనికొస్తుంది. కొద్దికాలంగా నాకు సరైన క్రికెట్ మ్యాచ్‌లు లేవు. ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. ఐపీఎల్ టోర్నీలో రాణించడానికి ప్రయత్నిస్తా. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటా. రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరుతుందని భావిస్తున్నా. ఇక టీమిండియాకు ఆడడమే నా తదుపరి లక్ష్యం' అని యశస్వి జైశ్వాల్ అన్నాడు.
తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో ముచ్చటించడంపై యశస్వి జైశ్వాల్ స్పందించాడు. 'నా ఫేవరెట్ క్రికెటర్ సచిన్. ఒమన్ పర్యటనకు వెళ్లేముందు ఆయనతో మాట్లాడే అవకాశం దక్కింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ సచిన్‌తో ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే చాలా సంతోషపడ్డా. తర్వాత ఆయనతో కొంతసేపు మాట్లాడే అవకాశం కలిగింది. అప్పుడు సచిన్ ఎంతో వినయంగా ఉన్నారు. అలాగే నా ఆట గురించి తెలిసిన ఆయన నేను మెరుగుపర్చుకోవాల్సిన కొన్ని విషయాలను సూచించారు. అంతపెద్ద ఆటగాడు నా బ్యాటింగ్‌కు సలహాలివ్వడం అద్భుతంగా అనిపించింది. అది నాకో ప్రత్యేక సందర్భం. ఆయన చెప్పినట్లే నా నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని జైశ్వాల్ తెలిపాడు.
గతేడాది ఐపీఎల్ 13వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైశ్వాల్‌ను తొలిసారి కొనుగోలు చేసింది. రూ.20లక్షల కనీస ధరకు చేజిక్కించుకుంది. దీంతో ఆ సీజన్‌లో యశస్వికి మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది. ఇక ఈ ఏడాది మే 4న అర్ధాంతరంగా నిలిచిపోయిన 14వ సీజన్ తొలి భాగంలోనూ యశస్వి మూడు మ్యాచ్‌లే ఆడాడు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్ట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే మిగతా సీజన్‌లో రాణించి జట్టును విజయపథంలో నడిపించాలని యశస్వి ఆశిస్తున్నాడు.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది. గత సీజన్ మాదిరిగానే దుబాయ్, షార్జా, అబుదాబిలో కఠిన బయో బబుల్ వాతావరణంలో టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం యశస్వి జైశ్వాల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్‌తో కలిసి దుబాయ్‌లోని ఓ హోటల్లో క్వారంటైన్‌లో ఉన్నాడు. మరోవైపు రాబోయే మెగా ఈవెంట్‌లో మంచి ప్రదర్శన చేసేందుకు ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications