
చెన్నై: హ్యాట్రిక్ పరాజయాల అనంతరం సమిష్టిగా సత్తాచాటిన పంజాబ్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం రాత్రి డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు పరాజయాల తర్వాత ఈ మ్యాచ్‌తో పంజాబ్ తిరిగి గెలుపు పట్టాలెక్కగా.. ముంబై వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. ముంబై లాంటి బలమైన జట్టుపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ విజయం సాధించడంతో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
వసీం జాఫర్ పంజాబ్ కింగ్స్ జట్టు లోగో అయిన సింహం ఫోటోను పోస్ట్ చేసి దానిపై క్యాప్షన్‌ను ఇలా పెట్టాడు. 'జబ్ షికార్ కార్తే హై, బడా హీ కార్టే హై (సింహం వేట మొదలుపెడితే.. పెద్దవాటినే వేటాడుతుంది) అంటూ రాసుకొచ్చాడు. పటిష్ట ముంబైపై పంజాబ్ గెలుపొందడంతో రోహిత్ సేనకు జాఫర్ ఇలా పంచ్ ఇచ్చాడు. సాధారణంగా జాఫర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. భారత క్రికెటర్లలో వీరేందర్ సెహ్వాగ్ లానే జాఫర్ కూడా తనదైన శైలిలో సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతు నెటిజన‍్లను ఆకట్టుకుంటాడు. జాఫర్ చేసే ట్వీటలో పంచులే ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. సూర్యకుమార్ యాదవ్ (33; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్ గేల్ (35 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో పంజాబ్ 17.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 132 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్‌ను ఓడించిన తరువాత పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ఈ ముంబై సీజన్లో మూడవ ఓటమిని చవిచూసినప్పటికీ.. రన్‌రేట్ కారణంగా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సోమవారం కోల్‌కతాతో పంజాబ్ తలపడనుండగా.. గురువారం రాజస్థాన్‌తో ముంబై ఢీ కొట్టనుంది.