
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మన్కడింగ్ ద్వారా గతంలో వార్తల్లో నిలిచిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఐపీఎల్ 2021లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ స్పిన్నర్ ఆర్ అశ్విన్, కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మధ్య జరిగిన ఫైట్ అందరికీ తెలిసిందే. కోల్‌కతా బ్యాటర్ రాహుల్ త్రిపాఠి విసిరిన త్రో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను తాకి వెళ్తుండగా.. అశ్విన్ పరుగు కోసం ప్రయత్నించాడు. ఇలాంటి సందర్భంలో పరుగు తీయొచ్చని ఎంసీసీ నిబంధనల్లో ఉంది. అయితే అశ్విన్ చర్య సిగ్గుచేటని.. క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని మోర్గాన్ మ్యాచ్ అనంతరం అన్నాడు.
మ్యాచులో ఆర్ అశ్విన్ ఔటవగానే.. మోసం చేస్తే ఇలాగే జరుగుతుంది అని కోల్‌కతా పేసర్ టీమ్ సౌథీ పేర్కొన్నాడు. అనంతరం అశ్విన్‌తో సౌథీ, ఇయాన్ మోర్గాన్ వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న కోల్‌కతా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇంతకు డీకే ఏమన్నాడంటే.. మోర్గాన్‌కు ఇలాంటివి నచ్చవని, బాల్ ఓ బ్యాట్స్‌మన్ లేదా బ్యాట్‌కు తగిలి దూరంగా వెళ్లినప్పుడు పరుగు తీయకూడదని అతడు భావిస్తాడని మ్యాచ్ తర్వాత కార్తీక్ అన్నాడు. ఈ వ్యవహారంపై అశ్విన్ గురువారం ట్విటర్ వేదికగా స్పందించాడు. ఆ సమయంలో పరుగు కోసం వెళ్తున్నా.. ఫీల్డర్ విసిరిన బంతి పంత్‌ను తాకిందన్న సంగతి తనకు తెలియదని, ఆ సమయంలో పరుగు కోసం వెళ్లానని పేర్కొన్నాడు.
'ఫీల్డర్ విసిరిన బంతి రిషబ్ పంత్‌ను తాకిందన్న సంగతి నాకు తెలియదు. ఆ సమయంలో పరుగు కోసం వెళ్తున్నా. పంత్‌కు బంతి తాకిందని తెలిసినా నేను పరుగు కోసం ప్రయత్నించేవాడిని. అందుకు నిబంధనలు ఉన్నాయి. ఇయాన్ మోర్గాన్ మాదిరి అమర్యాదకర వ్యక్తిని నేను కాదు. క్రికెట్ స్ఫూర్తి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండదు. నేను గొడవకు దిగలేదు. మైదానంలో చివరి దాకా పోరాడటం, నిబంధనలకు లోబడి ఆడటం, మ్యాచ్ అయ్యాక కరచాలనాలు ఇచ్చుకోవడమే క్రీడా స్ఫూర్తి. ఇదే నాకు తెలిసింది' అని ఢిల్లీ స్పిన్నర్ ఆర్ అశ్విన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.
తాజాగా దినేష్ కార్తీక్ వ్యాఖ్యలపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఇయాన్ మోర్గాన్‌తో పాటు దినేష్ కార్తీక్‌పై కూడా వీరూ సెటైర్ వేశాడు. 2019 ప్రపంచకప్ ఫైనల్లో మోర్గాన్ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా సెహ్వాగ్ గుర్తు చేశాడు. జులై 14 2019లో చివరి ఓవర్‌లో బాల్ ఇలాగే బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి దూరంగా వెళ్లింది. మరి అప్పుడు ఇయాన్ మోర్గాన్ లార్డ్స్ బయట ధర్నాకు కూర్చొని.. ప్రపంచకప్ ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించాడు. దీంతో న్యూజిలాండ్ గెలిచింది కదా?. భలే చెప్పొచ్చావ్ కార్తీక్' అని అదిరిపోయే పంచ్ ఇచ్చాడు సెహ్వాగ్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.