
అబుదాబి: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3/13) చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. వరుణ్ చక్రవర్తికి తోడు ఆండ్రీ రస్సెల్ (3/9), లూకీ ఫెర్గూసన్ (2/24) కూడా వికెట్లు పడగొట్టడంతో ఆర్‌సీబీ 19 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో కేకేఆర్ ముందు 93 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 22 పరుగులు చేయగా.. అరంగేట్ర ఆటగాడు కేఎస్ భరత్ 16 రన్స్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (5), మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ పూర్తిగా నిరాశపరిచారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు రెండో ఓవర్‌లోనే భారీ షాక్ తగిలింది. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లీ (5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (16)తో కలిసి దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే లూకీ ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్‌లో చివరి బంతికి దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి పడిక్కల్ ఔటయ్యాడు. తర్వాత ఆర్‌సీబీ వరుసగా వికెట్లను చేజార్చుకుంది. ఒక్కరు కూడా క్రీజులో నిలవలేకపోయారు.
ఆండ్రీ రస్సెల్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో కేఎస్ భరత్ (16), ఏబీ డివిలియర్స్ (0)లు ఔటయ్యారు. ఈ క్రమంలో 10 ఓవర్లకు ఆర్‌సీబీ 4 వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేసింది. ఇక వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్‌లో హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ (10), వనింద హసరంగ (0) పెవిలియన్ చేరారు. కైల్ జేమీసన్ (4), సచిన్ బేబీ (7) కూడా త్వరగానే ఔట్ అయ్యారు. హర్షల్ పటేల్(12) రెండు ఫోర్లు బాది ఫెర్గూసన్ వేసిన 17వ ఓవర్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. మొహ్మద్ సిరాజ్ (8)ని రసెల్ ఔట్ చేశాడు. దాంతో ఆర్‌సీబీ 92 పరుగులకు ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్లలో చక్రవర్తి, రసెల్ మూడు పడగొట్టగా.. ఫెర్గూసన్ రెండు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ ద్వారా ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్ ఆడిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ ప్లేయర్ కూడా ఒకే ఫ్రాంచైజీకి 200 మ్యాచ్‌లు ఆడలేదు. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే.. ఆర్‌సీబీ తరఫున కోహ్లీకి ఇది 215 మ్యాచ్. ఛాంపియన్స్ లీగ్ టీ20లో బెంగళూరు తరఫున 15 మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. మహీ చెన్నై తరఫున 182 మ్యాచులు ఆడాడు. తర్వాతి స్థానాల్లో సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్-172), కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్-172), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్-162)లు వరుసగా ఉన్నారు.