
దుబాయ్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో మిగిలిపోయిన మ్యాచ్‌లు ఆడేందుకు ప్లేయర్స్ అందరూ యూఏఈ చేరుకుంటున్నారు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు రద్దవ్వడంతో భారత ఆటగాళ్లు దుబాయ్ బాటపట్టారు. భారత, ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన విమానాల్లో అక్కడికి చేరుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ శనివారమే ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి చేరుకోగా.. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు వచ్చారు.
ఆదివారం ఉదయం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు దుబాయ్ వచ్చారు. కెప్టెన్ రిషబ్ పంత్, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ కెప్టెన్ అజింక్య రహానే, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, ఓపెనర్ పృథ్వీ షా, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ప్రత్యేక విమానంలో దుబాయ్ చేరుకున్నారు. వీరంతా దుబాయ్‌లో అడుగుపెట్టగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే యూఏఈ నిబంధనల ప్రకారం ఈ ఆటగాళ్లంతా ఆరు రోజులు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాతే తమ జట్లతో కలిసే వీలుంది. మరోవైపు విదేశీ ప్లేయర్లు ఇప్పటికే యూఏఈకి చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకుని జట్టుతో కలిసిపోయాడు. ఏప్రిల్‌లో జరిగిన సీజన్‌లో భుజం గాయం కారణంగా అతడు ఆడని సంగతి తెలిసిందే. అప్పుడు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును విజయ పథంలో నడిపించాడు. ఈ క్రమంలోనే టోర్నీ నిలిచిపోయేసరికి జట్టును టాప్‌లో నిలిపాడు. అందుకే అయ్యర్ జట్టులోకి వచ్చినా.. పంతే కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక మిగిలిన సీజన్‌లోనూ ఢిల్లీ ఇలాంటి ప్రదర్శనే చేసి తొలిసారి కప్పు ఎగరేసుకుపోవాలని చూస్తోంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుంది.
ఇంగ్లండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలోని ఆటగాళ్లు అందరూ యూఏఈ చేరుకున్నారు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేస్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆదివారం ఉదయం దుబాయ్ చేరుకున్నారు. 'మీరందరూ ఎదురు చూస్తున్న వార్త.. కింగ్ కోహ్లీ, మియా మ్యాజిక్ దుబాయ్‌లోని టీమ్‌తో కలిశారు' అని ఆర్సీబీ టీమ్ ట్వీట్ చేసింది. చెన్నై అటగాళ్లు రవీంద్ర జడేజా, చేతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్, మోయిన్ అలీ మరియు సామ్ కరన్.. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మహ్మద్ షమీలు కూడా దుబాయ్ చేరుకున్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చాయి.
ఇంగ్లండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడిన ఆయా ప్రాంచైజీ ఆటగాళ్లంతా ప్రస్తుతం దుబాయ్ చేరుకున్నారు. వీరందరూ ఆరు రోజులు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాతే తమ జట్లతో కలవనున్నారు. దీంతో ఐపీఎల్ ఆరంభానికి ఒక రోజు ముందు క్వారంటైన్ ముగుస్తుంది. ఈ ఆరు రోజుల్లో ఆటగాళ్లకు అందరికి రెండు సార్లు కరోనా టెస్టులు చేయనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 రెండో దశ ఆరంభం కానుండగా.. చెన్నై, ముంబై మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.