Vijay Shankar నువ్వు కచ్చితంగా 3D ప్లేయరే.. కానీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేతకాదు!

IPL 2021: Vijay Shankar Another Poor Show Against Delhi Capitals | Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే జోస్ బట్లర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను విజయ్ శంకర్ నేలపాలు చేశాడు. అప్పటికి బట్లర్ వ్యక్తిగత స్కోరు 7 పరుగులుకాగా.. చివరికి అతను 124 పరుగులతో రాజస్థాన్‌‌కు తిరుగులేని స్కోరును అందించాడు. బౌలింగ్‌లోనూ మూడు ఓవర్లు వేసిన విజయ్ శంకర్ 42 పరుగులు సమర్పించుకోగా.. బ్యాటింగ్‌లో 8 బంతులాడి 8 పరుగులే చేసి ఔటయ్యాడు. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ మూడింటిలో విఫలమై సన్‌రైజర్స్ ఓటమికి కారణమయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఈ తమిళనాడు క్రికెటర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

నువ్వు కచ్చితంగా 3D ప్లేయర్..

ఎమ్మెస్కే ప్రసాద్ చెబితే ఏమో అనుకున్నామ్.. కానీ నువ్వు కచ్చితంగా 3డీ ప్లేయర్‌వే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌‌లోనూ ఫెయిల్ అంటూ చురకలు అంటిస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌‌కు జట్టును ఎంపిక చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అప్పటి టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. అంబటి రాయుడితో పోలిస్తే విజయ్ శంకర్ మూడు కోణాల్లో (బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌) టీమ్‌కి ఉపయోగపడతాడని చెప్పుకొచ్చాడు. దాంతో.. అంబటి రాయుడు వరల్డ్‌కప్‌లో విజయ్ శంకర్‌ ప్రదర్శనను చూసేందుకు 3D గ్లాస్‌‌ను ఇప్పుడే ఆర్డర్ చేసినట్లు ట్వీట్ చేశాడు. అప్పట్లో ఈ ట్వీట్ పెద్ద దుమారం రేపగా.. విజయ్ శంకర్ ప్రస్తావన వచ్చిన ప్రతీసారి ఆ త్రీడీ గ్లాస్ చర్చ తెరపైకి వస్తోంది.

అందుకే చాన్స్‌లా..?

విజయ్ శంకర్ తమిళనాడుకు చెందినవాడనే ఒకే ఒక్క కారణంతో జట్టులో కొనసాగిస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా తమిళనాడువారే కావడంతో అతను విఫలమైనా వరుస అవకాశాలిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇన్ని మ్యాచ్‌‌లు విఫలమైనా తుది జట్టులో చోటు దక్కుతుందంటే అదే కారణమంటున్నారు. డేవిడ్ వార్నర్‌నే పక్కన పెట్టిన సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్ అతని కన్నా దారుణంగా విఫలమవుతున్న విజయ్ శంకర్‌ను పక్కన పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నాడు.

శంకర్ కెరీర్ ముగిసినట్లే..

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన శంకర్.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమై జట్టు పరాజయాలకు కారణమయ్యాడు. బ్యాటింగ్‌లో కేవలం 58 పరుగులు మాత్రమే చేసిన అతను.. బౌలింగ్‌లో మూడే వికెట్లు తీసాడు.అయినా సన్‌రైజర్స్ టీమ్ ఈ తమిళనాడు క్రికెటర్‌కు వరుసగా అవకాశాలు ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ దేవుడెరుగు.. కీలక మ్యాచ్‌ల్లో సులువైన క్యాచ్‌లు నేలపాలు చేసి ఓటమికి కారణమయ్యాడు. ముంబైతో మ్యాచ్‌లో విధ్వంసకర వీరుడు కీరన్ పోలార్డ్ క్యాచ్ చేజార్చిన శంకర్.. నిన్నటి మ్యాచ్‌లో బట్లర్‌కు అవకాశమిచ్చాడు. ఈ ఇద్దరూ సన్‌రైజర్స్ ఓటమిని శాసించారు. దాంతో శంకర్ కెరీర్ ముగిసినట్లేనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

పేలవ బౌలింగ్.. పసలేని బ్యాటింగ్..

కెప్టెన్ మారినా.. తుది జట్టులో మార్పులు చేసినా సన్‌రైజర్స్ రాత మాత్రం మారడం లేదు. చెత్త ఫీల్డింగ్.. పేలవ బౌలింగ్.. పసలేని బ్యాటింగ్‌తో రాజస్థాన్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. జోస్ బట్లర్(64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సంజూ శాంసన్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) భాద్యతాయుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. సన్‌రైజర్స్ చెత్త ఫీల్డింగ్‌ను అవకాశంగా మార్చుకున్న ఈ ఇద్దరు రెండో వికెట్‌కు ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. జానీ బెయిర్ స్టో(31), మనీష్ పాండే(30)తో సహా అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, క్రిస్ మోరీస్ మూడేసి వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రాహుల్ తెవాటియా చెరొక వికెట్ తీశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 3, 2021, 9:37 [IST]
Other articles published on May 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X