
యూఏఈలోనే ఐపీఎల్, ప్రపంచకప్:
పురుషుల టీ20 ప్రపంచకప్ 2021 ముందు జరుగనున్న ఐపీఎల్ 2021 లీగ్ రెండో దశలో దాదాపు విదేశీ క్రికెటర్లు అందరూ ఆడనున్నారు. మొదటగా భారత్‌లో కరోనా కేసులు పెరగడంతో తొలి దశ మ్యాచులు జరిగేప్పుడు విదేశీ క్రికెటర్లు ఒక్కరుగా ఇంటిదారిపట్టారు. చివరికి లీగ్ వాయిదా పడింది. దీంతో రెండో దశకు తాము అందుబాటులో ఉండమని తేల్చి చెప్పారు. పొట్టి కప్ హక్కులు కూడా భారత్ వద్దే ఉండడంతో బీసీసీఐ టోర్నీ విషయంలో ఆందోళన చెందింది. యూఏఈలోనే ఐపీఎల్, ప్రపంచకప్‌లు నిర్వహిస్తామని ఐసీసీకి తెలిపింది. ఐసీసీ కూడా ఓకే అనడంతో బీసీసీఐ ఊపిరిపీల్చుకుంది. ఆపై అన్ని దేశాలు కూడా పొట్టి కప్ ఆడతామని తెలిపాయి.

మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుందని:
ఐపీఎల్ 2021 సెప్టెంబర్ 19న ఆరంభం అయి అక్టోబర్ 15న ముగుస్తుంది. అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచులు ఆరంభం కానున్నాయి. దీంతో టీ20 ప్రపంచకప్‌లో రాణించడానికి ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ చక్కగా ఉపయోగపడుతుదని క్రికెటర్లు భావిస్తున్నారు. రెండు టోర్నీలు ఒకే వేదికపై జరగనుండడంతో మంచి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభిస్తుందని విదేశీ క్రికెటర్లు ఆలోచన చేసి ఐపీఎల్ 2021 ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సెకెండ్ ఫేజ్ చాలా మజాగా ఉంటుందని ఫ్యాన్స్ సహా విశ్లేషకులు అనుకుంటున్నారు. మొదటి ఫేజ్ లానే రెండో ఫేజ్ కూడా రసవత్తరంగా సాగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

అట్టడుగు స్థానంలో సన్‌రైజర్స్:
సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఇదే మ్యాచుతో రెండో దశ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 29 మ్యాచ్‌లు ముగిసాయి. అప్పటికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), నాలుగులో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒకే విజయంతో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో రెండో దశలో అయినా సన్‌రైజర్స్ పుంజుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

వాళ్ల బ్యాటింగ్ ఫామ్ పైనే:
అయితే ప్రతీ జట్టులో ప్రతీ సీజన్‌లో కొందరు ప్లేయర్లు క్రమం తప్పకుండా రాణిస్తున్నారు. వాళ్ల బ్యాటింగ్ ఫామ్ పైనే ఆయా జట్లు జయాపజయాలు ఆధారపడి ఉంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో ఏబీ డివిలియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో సురేష్ రైనా, ముంబై ఇండియన్స్‌కు కిరాన్ పొలార్డ్, పంజాబ్ కింగ్స్ విజయాల్లో క్రిస్ గేల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో డేవిడ్ వార్నర్ కీలకంగా ఉన్నారు. వీరందరూ బ్యాటుతో కనుక రాణిస్తే.. ఆయా జట్లు తప్పకుండా విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మన తెలుగు జట్టులో వార్నర్ చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. అతడు ఫామ్ జట్టుకు ఎంతో ముఖ్యం. వార్నర్ పరుగుల వరద పారించిన ఏడాది సన్‌రైజర్స్ కప్ కొట్టింది. మిగతా సీజన్లలో ప్లే ఆఫ్స్, ఒక్కోసారి ఫైనల్ చేరింది. అయితే ఈ ఏడాది వార్నర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో వరుసగా మ్యాచ్‌లు ఓడిపోయి మూల్యం చెల్లించుకుంది.

కిరాన్ పొలార్డ్/ఏబీ డివిలియర్స్:
కిరాన్ పొలార్డ్ 10 పరుగుల లోపు చేస్తే ముంబై ఇండియన్స్ జట్టు 41 శాతం మ్యాచ్‌లలో గెలిచింది. 30+ పరుగులు చేస్తే జట్టు 75 శాతం మ్యాచ్‌లలో ముంబై గెలిచింది. 50+ పరుగులు చేసినప్పుడు 69 శాతం మ్యాచ్‌లలో గెలిచింది. ఇక మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏబీ 10 పరుగుల లోపు చేస్తే బెంగళూరు జట్టు 34 శాతం మ్యాచ్‌లలో గెలిచింది. 30+ పరుగులు చేస్తే జట్టు 63 శాతం మ్యాచ్‌లలో గెలిచింది. 50+ పరుగులు చేసినప్పుడు 67 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.

సురేష్ రైనా/డేవిడ్ వార్నర్/క్రిస్ గేల్:
చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో సురేష్ రైనా చాలా కీలకం మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే రైనా.. మ్యాచును ఒంటిచేత్తో మలుపు తిప్పగలడు. రైనా 10 పరుగుల లోపు చేస్తే చెన్నై 42 శాతం మ్యాచ్‌లలో గెలిచింది. 30+ పరుగులు చేస్తే 68 శాతం మ్యాచ్‌లలో.. 50+ పరుగులు చేసినప్పుడు 63 శాతం మ్యాచ్‌లలో చెన్నై గెలిచింది. డేవిడ్ వార్నర్ 10 పరుగుల లోపు చేస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 శాతం మ్యాచ్‌లలో గెలిచింది. 30+ పరుగులు చేస్తే 54 శాతం.. 50+ పరుగులు చేసినప్పుడు 65 శాతం మ్యాచ్‌లలో తెలుగు జట్టు గెలిచింది. పంజాబ్ కింగ్స్ విజయాల్లో క్రిస్ గేల్ కీలకం. గేల్ 10 పరుగుల లోపు చేస్తే జట్టు 29 శాతం మ్యాచ్‌లలో గెలిచింది. 30+ పరుగులు చేస్తే 64 శాతం.. 50+ పరుగులు చేసినప్పుడు 65 శాతం మ్యాచ్‌లలో పంజాబ్ గెలిచింది.


Click it and Unblock the Notifications
