ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021.. 52 రోజులు 60 మ్యాచ్‌లు! వేదికలు ఇవే!!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు ఇది శుభవార్తే. ఐపీఎల్ 2021కు సంబంధించిన తేదీలు వచ్చేశాయి. 14వ ఎడిషన్ ఐపీఎల్.. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ మ్యాచ్ మే 30న జరగనుంది. అయితే దీనికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం దక్కాల్సి ఉంది. 52 రోజుల పాటు జరగనున్న ఐపీఎల్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్నాయని సమాచారం. టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే బీసీసీఐ రిలీజ్ చేయనుంది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. ఈసారి మాత్రం స్వదేశంలోనే నిర్వహించాలని నిర్ణయించింది.

వేదికల విషయమై వచ్చేవారం చర్చ:
వచ్చేవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌తో పాటు వేదికలను కూడా ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆరు వేదికలను ఖరారు చేసినట్లు తెలిసింది. అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కత, ముంబైలు బీసీసీఐ జాబితాలో ఉన్నాయి. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండడంతో ముంబైలో మ్యాచ్‌లు జరగడం కష్టమే. ముంబై స్థానంలో హైదరాబాద్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే మ్యాచ్ వేదికలపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకునే నిర్ణయం వరకు వేచి చూడాల్సిందే.

ముంబై, ఢిల్లీ మధ్య ఆరంభ మ్యాచ్:
ఐపీఎల్ 2020ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగింది. దుబాయ్, అబుదాబి, షార్జాలలో మ్యాచ్‌లు జరిగాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై జట్టు ఐదోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీకి నిరాశే ఎదురైంది. ఈసారి ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ ముంబై, ఢిల్లీ మధ్య జరగనుంది. ఇటీవల ఐపీఎల్ 2021 వేలం ముగియగా.. ఇప్పటికే ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై చేరుకున్న సంగతి తెలిసిందే.

ఫ్రాంఛైజీల అసంతృప్తి:
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ ఫ్రాంఛైజీల సొంత మైదానాలు అయిన హైదరాబాద్, జైపూర్, మొహాలిలు బీసీసీఐ జాబితాలో లేకపోవడంతో ఆ ప్రాంఛైజీలు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశాయి. మూడు ఫ్రాంఛైజీలు తమ సొంత మైదానాల్లో మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐకి లేఖ రాశాయి. వేదికల జాబితాలో మొహాలీని కూడా చేర్చాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బీసీసీఐకి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్, హెచ్‌సీఏ తరఫున అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ కూడా ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచులను హైదరాబాద్‌లో నిర్వహించడానికి బీసీసీఐపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications