
దుబాయ్: కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశకు సమయం దగ్గరపడుతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది. గత సీజన్ మాదిరిగానే దుబాయ్, షార్జా, అబుదాబిలో కఠిన బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి. సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టోర్నీ కోసం ఇప్పటీకే అన్ని జట్లు అక్కడికి చేరుకొని ముమ్మర సాధన చేస్తున్నాయి.
అందరికంటే ముందే యూఏఈ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఎప్పుడో ప్రాక్టీస్ ఆరంభించింది. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, పేసర్ దీపక్ చహర్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, సీనియర్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప, స్పిన్నర్ కరన్ శర్మ సహా పలువురు ఆటగాళ్లు దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆటగాళ్ల సాధనను దగ్గరుండి మరి పరీక్షిస్తున్నాడు. అయితే చెన్నై ప్లేయర్స్ ఒకవైపు సాధన చేస్తూనే.. మరోవైపు జాలిగా గడుపుతున్నారు. సహచర ఆటగాళ్లతో ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం దుబాయ్‌లోని ప్రాక్టీస్ సెషన్లలో బిజీగా ఉన్న మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో డబ్ల్యూడబ్ల్యూఈ 'సూపర్ స్టార్' జాన్ సీనా మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా.. స్విమ్మింగ్ పూల్ వద్ద సహచరుడు కేఎమ్ ఆసిఫ్‌తో రైనా ఓ అద్భుత స్టంట్‌ను ప్రదర్శిస్తాడు. అచ్చం జాన్ సీనా స్టంట్ మారిదే ఆసిఫ్‌ను స్విమ్మింగ్ పూల్ లోపలికి తోచేశాడు. దీనికి 'దట్ నేమ్ ఈజ్ జాన్ సీనా.. మై నేమ్ ఈజ్ సురేశ్ రైనా' అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. రైనా అద్భుతంగా స్టంట్‌ను ప్రదర్శించాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), నాలుగులో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన సురేష్ రైనా కేవలం 123 పరుగులే చేసి అభిమానులను నిరాశపరిచాడు. దాంతో మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా చిన్న తలా చెలరేగాలని చెన్నై అభిమానులు ఆశిస్తున్నారు.
తాజాగా సురేష్ రైనా మాట్లాడుతూ... 'ఈ సీజన్లో మా ఆటతీరు, ఎంఎస్ ధోనీ సారథ్యం వల్ల అదనపు ఆత్మవిశ్వాసం లభించింది. మేమందరం మా విజయాలను ఆస్వాదిస్తున్నాం. మహీ అందరికీ స్వేచ్ఛనిస్తాడు. దీంతో ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటతీరు బయటకు వస్తుంది. మా జట్టులో మొయిన్ అలీ, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. మేం జోరుమీదున్నాం. ధోనీ కోసం ఈసారి టైటిల్ గెలుస్తామనే ధీమా ఉంది. అదే జరిగితే మరో రెండు మూడేళ్లు మహీ లీగులో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది' అని అన్నాడు. ఈ సీజన్ గడిచాక ధోనీ ఆడకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నా.. వాటిని సీఎస్‌కే, రైనా కొట్టిపారేయడం గమనార్హం.