
హైదరాబాద్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్‌లు సెప్టెంబరు 19న ఆరంభం కానున్నాయి. గత సీజన్ మాదిరిగానే దుబాయ్, షార్జా, అబుదాబిలో ఐపీఎల్ మ్యాచులు జరుగనున్నాయి. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటంతో మే మొదటి వారంలో ఈ మెగా టోర్నీ వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఎన్నో సమాలోచనల అనంతరం మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. యూఏఈలో జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే కొన్ని జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి.
సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో పలు ఫ్రాంచైజీలు బయోబుడగలను ఏర్పాటు చేసి తమ ఆటగాళ్లను యూఏఈకి తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యూఏఈ వెళ్లేందుకు సిద్ధమైంది. మిగిలిన మ్యాచులు ఆడేందుకు సన్‌రైజర్స్ వచ్చే నెల 1న యూఏఈకి పయనం కానుంది. దుబాయ్‌లో ల్యాండ్ కానున్న ఎస్ఆర్‌హెచ్ ఐసీసీ అకాడమీలో కానీ, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కానీ ప్రాక్టీస్ చేయనుంది. ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్స్ ముంబై నుంచి యూఏఈకి వెళ్లనున్నారు.
ఐపీఎల్ 2021 నిలిచే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయం అందుకుంది. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ సెమీస్ చేరడం కాస్త కష్టమనే చెప్పాలి. మిగిలిన అన్ని మ్యాచులో గెలిస్తే తప్ప.. ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మరో ఆప్షన్ లేదు. 2-3 మ్యాచులో ఓడితే మాత్రం కచ్చితంగా ఇంటికి రావాల్సిందే. ఐపీఎల్ 2021లో ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శనే ఇందుకు కారణం. తొలి దశలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన ఎస్ఆర్‌హెచ్.. మలి దశలో అయినా ఆకట్టుకుంటుందో చూడాలి.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని పలువురు ఆటగాళ్లు ఆగస్టు 13న యూఏఈకి చేరుకున్నారు. అనంతరం నేరుగా క్వారంటైన్‌లోకి వెళ్లారు. గురువారం క్వారంటైన్ పూర్తికావడంతో చెన్నై ప్రాక్టీస్‌ను మొదలెట్టింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో చెన్నై ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చెన్నై తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ఐపీఎల్ 13 సీజన్‌లో ఆశించినమేరకు ఆకట్టుకోలేకపోయిన చెన్నై.. ఈ సీజన్‌లో జోరుమీదుంది. టోర్నీ వాయిదాపడే నాటికి ఏడు మ్యాచ్‌లు ఆడిన ధోనీసేన.. ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.