Umran Malik: ఏం చేద్దాం మచ్చా: నెట్ బౌలర్‌కు జట్టులో చోటు: సన్‌రైజర్స్ సంచలనం

అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. స్వదేశీ పిచ్ మీదే కాదు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ ఆ జట్టు తలరాత మారట్లేదు. ఆ జట్టును దురదృష్టం వెంటాడుతూ ఎమిరేట్స్ దాకా వచ్చేసింది. ఆటగాళ్లు గాడినపడట్లేదు. విజయాల కోసం ముఖం వాచిపోయిందా సన్‌రైజర్స్. ప్లే ఆఫ్ రేసు నుంచి కూడా తప్పుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చనేలా ఉంటోంది ఆ జట్టు ఆటతీరు.

ఎమిరేట్స్ వెళ్లినా..
వరుస విజయాలను అందుకుంటే గానీ.. ప్లే ఆఫ్‌లో అడుగు పెట్టడానికి ఏ మాత్రం అవకాశాలు లేవు. పోనీ- వరుస విజయాలు అందుకుంటుందా అనేది అనుమానమే. దీనికితోడు ఆటగాళ్లు ఫిట్‌నెస్ కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ఎమిరేట్స్ ఐపీఎల్ షిఫ్ట్ అయిన తరువాత ఆడిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది హైదరాబాదీ టీమ్. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగా.. ఢిల్లీ కేపిటల్స్ అలవోకగా ఛేదించింది.

పంజాబ్ కింగ్స్‌తో పోటీ..
రెండు వికెట్లను నష్టపోయి 139 పరుగులు చేసింది. ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై గెలిచింది ఢిల్లీ. సన్‌రైజర్స్ తన తరువాతి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. దొందు దొందే అన్నట్లు పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. సన్‌రైజర్స్ కంటే ఓ స్థానం పైనుందా టీమ్ పాయింట్ల పట్టికలో. తొమ్మిది మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది మూడు మాత్రమే. మొత్తం ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.

కాస్త బెటర్
ఎనిమిది మ్యాచుల్లో ఒకే ఒక్క విజయంతో రెండు పాయింట్లను ఖాతాలో వేసుకున్న సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. అలాంటి పంజాబ్ కింగ్స్ జట్టును సన్‌రైజర్స్ తన తదుపరి మ్యాచ్‌లో ఎదుర్కొనబోతోంది. శనివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షార్జా క్రికెట్ స్టేడియంలో ఆరంభమౌతుంది. ఎమిరేట్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓడిందా పంజాబ్. సన్‌రైజర్స్‌తో పోల్చుకుంటే చాలా బెటర్ ఆ జట్టు ఆడుతున్న తీరు.

ముగ్గురు ఆటగాళ్లు టోర్నీకి దూరం..
కాగా- గోరు చుట్టు మీద రోకలిపోటులా ఇప్పటికే వరుస పరాజయాల బాట పట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆటగాళ్ల లోటు వెంటాడుతోంది. స్టార్ బౌలర్ టీ నటరాజన్ ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఐసొలేషన్‌లో ఉంటున్నాడు. అతనితో కలిసి తిరిగినందున విజయ్ శంకర్ కూడా ఐసొలేషన్‌లోకి వెళ్లాడు. తాజాగా- షెర్ఫానె రూథర్‌ఫర్డ్ కూడా స్వదేశానికి తిరగుముఖం పట్టాడు. అతని తండ్రి కన్నుమూయడంతో ఇంటికెళ్లాడతను.

నటరాజన్ స్థానంలో నెట్ బౌలర్..
ఈ పరిస్థితుల్లో బౌలర్ లేని కొరతను తీర్చుకుంది సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్. టీ నటరాజన్ స్థానంలో ఉమ్రాన్ మలిక్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే జట్టును ప్రకటించింది. షార్ట్‌టర్మ్‌గా ఉమ్రాన్ మలిక్‌కు చోటు కల్పించినట్లు తెలిపింది. అంటే- నటరాజన్ వచ్చేంత వరకే మలిక్ టీమ్‌లో కొనసాగుతాడు. ఉమ్రాన్ మలిక్.. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నెట్ బౌలర్‌గా ఉంటోన్నాడు.
ఈ ఏడాదే లిస్ట్ ఎ క్రికెట్‌లో..
జమ్మూ కాశ్మీర్ అతని స్వరాష్ట్రం. శ్రీనగర్ అతని స్వస్థలం. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. 21 సంవత్సరాల ఉమ్రాన్ మలిక్ ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. జమ్మూ కాశ్మీర్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లిస్ట్ ఎ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ హజారె ట్రోఫీలో ఆడాడు. మొత్తంగా నాలుగు వికెట్లను పడగొట్టాడు. నటరాజన్ కరోనా వైరస్ బారి నుంచి కోలుకునేంత వరకూ ఉమ్రాన్ మలిక్ జట్టులో కొనసాగుతాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications