
చెన్నై: గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షం కురుస్తోంది. వేసవితాపంతో అల్లాడుతున్న ప్రలజకు ఇది కాస్త ఉపశమనం కలిగించినా.. ఐపీఎల్ అభిమానులకు మాత్రం నిరాశ కలిగించే అంశమే. ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ రోజు రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ జరగనున్న చెన్నై నగరంలోని పలు చోట్ల వర్షం కురుస్తుండడంతో.. హైదరాబాద్ vs బెంగళూరు మ్యాచ్ జరగడం అనుమానంగానే మారింది. అయితే కురిసేది చిరు జల్లులే కాబట్టి.. మ్యాచ్ ఆరంభ సమయానికి వరణుడు కరుణిస్తే మ్యాచ్ సజావుగా సాగనుంది.
ప్రస్తుతానికి అయితే చెన్నై నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులే కురుస్తున్నాయని సమాచారం. మరో రెండు రోజుల కూడా అక్కడ వర్షాలు కురవనున్నాయని చెన్నై వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కొద్దిసేపటి క్రితం చెన్నైలోని అన్నా నగర్ వెస్ట్‌లో మోస్తరు వర్షం పడింది. అయితే చిదంబరం స్టేడియం పరిసరాల్లో మాత్రం చిరు జల్లులు కురిసాయి. ప్రస్తుతానికి అక్కడ ఆకాశం మేఘావృతం అయి ఉంది. వరణుడు ఎప్పుడైనా రావొచ్చు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ సాధ్యంకాకపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు.
చెన్నైలోని చెపాక్ పిచ్ మామూలుగానే స్పిన్నర్లకు అనుకూలిస్తుంటుంది. గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో స్పిన్నర్లే రాణించారు. ఈ రోజు కూడా స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత ఉండనుంది. మిడిల్ ఓవర్లలలో వికెట్లు పడే అవకాశాలు ఎక్కువ. ఈ పిచ్‌పై పేసర్లు కాస్త కష్టపడాల్సిందే. చెపాక్ పిచ్‌పై సగటు స్కోరు 170గా నమోదవుతుంటుంది. 170 పరుగులు చేస్తే ఇక్కడ ఛేదన కాస్త కష్టమే.
ఐపీఎల్ టోర్నీలో బెంగళూరుపై హైదరాబాద్ పైచేయి సాధిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌ల్లో తలపడగా.. హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్‌లకిగానూ ఏడింట్లో బెంగళూరు జట్టు గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి పోరు చాలా ఆసక్తికంగా జరుగుతుంది. ఐపీఎల్‌లో బెంగళూరుపై ఇప్పటి వరకూ హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 231 పరుగులుకాగా.. హైదరాబాద్‌పై బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 227 పరుగులు.