సన్‌రైజర్స్‌కు బిగ్ ట్రబుల్: స్టార్ ఆల్‌రౌండర్ ఇంటిదారి

IPL 2021: Rutherford ఇంటిదారి.. SRH ని ఎవ్వడూ కాపాడలేడు | IPL Playoffs || Oneindia Telugu

అబెధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో ఘోరంగా ఆడుతోన్న జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాదే. స్వదేశీ పిచ్‌ మీదే కాదు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ ఆ టీమ్ తలరాత మారట్లేదు. ఆటతీరు గాడినపడట్లేదు. విజయాల కోసం ముఖం వాచిపోయిందా జట్టుకు. ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉంటోంది కూడా. వరుస విజయాలను అందుకుంటే గానీ.. ప్లే ఆఫ్‌లో అడుగు పెట్టడానికి ఏ మాత్రం అవకాశాలు లేవు.

పోనీ- వరుస విజయాలు అందుకుంటుందా అనేది అనుమానమే. ఎమిరేట్స్‌ ఐపీఎల్ షిఫ్ట్ అయిన తరువాత ఆడిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది హైదరాబాదీ టీమ్. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగా.. ఢిల్లీ కేపిటల్స్.. అలవోకగా ఛేదించింది. రెండు వికెట్లను నష్టపోయి 139 పరుగులు చేసింది. ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై గెలిచింది ఢిల్లీ కేపిటల్స్.

ఇక తన తరువాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. పాయింట్ల పట్టికలో తనతో పోటీ పడుతోన్న పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. శనివారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ షార్జా క్రికెట్ స్టేడియంలో ఆరంభమౌతుంది. పంజాబ్ పరిస్థితి కూడా సన్‌రైజర్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటోంది. తొమ్మిది మ్యాచుల్లో ఆరింట్లో ఓడిపోయింది. ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ఎమిరేట్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓడిందా పంజాబ్.

సన్‌రైజర్స్‌కు ప్రతి మ్యాచ్ అగ్నిపరీక్షగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ ట్రబుల్‌లో పడింది. జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ షెర్ఫానె రూథర్‌ఫర్డ్ అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. రూథర్‌ఫర్డ్ తండ్రి కన్నుమూశారు. దీనితో అంత్యక్రియల్లో పాల్గొనడానికి రూథర్‌ఫర్డ్ ఇంటి దారి పట్టాడు. అతని స్వదేశం గయానా. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్. జానీ బెయిర్‌స్టో స్థానంలో రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకుంది సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్. ఐపీఎల్ సీజన్లలో ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లను ఆడాడు. 73 పరుగులు చేశాడు.

వెస్టిండీస్‌లో ఇటీవలే ముగిసిన కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ప్యాట్రియాట్స్ తరఫున ఆడాడతను. ఈ జట్టు కరేబియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అందులో రాణించడం వల్లే బెయిర్ స్టో స్థానంలో రూథర్‌ఫర్డ్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది సన్‌రైజర్స్. కాగా ఇప్పటికే ఇద్దరు ప్లేయర్లు జట్టుకు దూరం అయ్యారు. కరోనా వైరస్ బారిన పడటం వల్ల స్టార్ బౌలర్ టీ నటరాజన్ జట్టుకు అందుబాటులో ఉండట్లేదు.

అతనితో సన్నిహితంగా మెలిగిన విజయ్ శంకర్ కూడా ఐసొలేషన్‌లోకి వెళ్లాడు. ఇప్పుడు తాజాగా రూథర్‌ఫర్డ్ కూడా దూరం కావడం ఊహించని పరిణామమే. రూథర్‌ఫర్డ్ తండ్రి మరణించడం పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ సంతాపాన్ని వ్యక్తం చేసింది. అతని కుటుంబానికి సానుభూతిని తెలిపింది. అంత్యక్రియలు ముగిసిన తరువాత అతను మళ్లీ జట్టులో చేరే అవకాశాలు లేకపోలేదు. ఎప్పటికి తిరిగి వస్తాడనేది తెలియరావట్లేదు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 24, 2021, 12:39 [IST]
Other articles published on Sep 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X