
ముంబై: రాజస్థాన్ రాయల్స్‌తో వాంఖడే మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. బౌలర్ల ధాటికి కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 రన్స్ చేసి.. రాజస్థాన్ ముందు 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. రాహుల్ త్రిపాఠి (36: 26 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) రాణించడంతో కోల్‌కతా ఆ మాత్రం స్కోరైనా సాధించింది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా టీ20 తరహాలో బ్యాటింగ్ చేయలేకపోయారు. నితీశ్ రాణా (22), దినేశ్ కార్తీక్ (25) రెండంకెల స్కోర్ చేశారు. క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముస్తఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్ పరుగులు కట్టడి చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. రాజస్థాన్ బౌలర్లు తమ పదునైన బంతులతో కేకేఆర్ బ్యాట్స్‌మన్ ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో పరుగులు చేయడానికి ప్రారంభం నుంచే కేకేఆర్ బ్యాట్స్‌మెన్ నానా అవస్థలు పడ్డారు. ముస్తాఫిజుర్ వేసిన ఆరో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్(11) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. యువ పేసర్ చేతన్ సకారియా వేసిన 9వ ఓవర్ మొదటి బంతికే నితీశ్ రాణా (22) వెనుదిరిగాడు. ఈ ఇద్దరూ ఎక్కువ బంతులు ఆడడంతో పవర్‌ప్లే ఆఖరికి కోల్‌కతా చేసింది 25 పరుగులు మాత్రమే.
రాహుల్ త్రిపాఠీ (36: 26 బంతుల్లో.. 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొంత ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్‌మన్ దారుణ ప్రదర్శన చేశారు. సునీల్ నరైన్ బౌండరీ బాది ఉనద్కట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజ్‌లోకి వచ్చిన ఇయాన్ మోర్గాన్.. కనీసం ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు. దీంతో 61 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో పడింది. కీపర్ దినేశ్ కార్తీక్ అండతో ధాటిగా ఆడిన త్రిపాఠీ కీలక సమయంలో పెవిలియన్ చేరాడు. కార్తీక్ పర్వాలేదనిపించినా.. జట్టు స్కోరు పెంచడంతో ఉపయోగపడలేదు.
ఇక చెన్నైతో మ్యాచ్‌లో చెలరేగి ఆడిన ఆండ్రూ రసెల్ (9: 7 బంతుల్లో.. 1 సిక్స్) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఓ సిక్స్ బాది.. మరో భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్ అయ్యాడు. గత మ్యాచ్ హీరో పాట్ కమిన్స్ కూడా రాణించలేదు. చివరలో మావి 7 బంతులు ఆడి 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 133 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లలో మోరిస్ 4 వికెట్లతో అదరగొట్టి కేకేఆర్ వెన్ను విరిచాడు. ఉనద్కత్, సకారియా, ముస్తాఫిజుర్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.