
ముంబై: వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పోరాడే స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా ఆల్‌రౌండర్లు మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 రన్స్ చేసి.. బెంగళూరు ముందు 178 పరుగుల లక్ష్యంను ఉంచింది. గత సీజన్ వరకు బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన ఆల్‌రౌండర్ శివమ్ దూబే (46; 32 బంతుల్లో 5×4, 2×6) చెలరేగాడు. రాహుల్ తేవాతియా (40; 23 బంతుల్లో 4×4, 2×6)మెరవగా.. రియాన్ పరాగ్ (25; 16 బంతుల్లో 4×4), కెప్టెన్ సంజు శాంసన్ (21; 18 బంతుల్లో 2×4, 1×6) రాణించారు. బెంగళూరు పేసర్లు మొహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ తలో మూడు వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే భారీ దెబ్బ తగిలింది. జోస్ బట్లర్ (8: 8 బంతుల్లో.. 2 ఫోర్లు), మనన్ వోహ్రా (7: 9 బంతుల్లో.. 1 ఫోర్) వెంటవెంటనే అవుట్ అయ్యారు. బట్లర్‌ను సిరాజ్ బోల్డ్ చేయగా.. వోహ్రాను జేమిన్సన్ పెవిలియన్ చేర్చాడు. ఇక కెప్టెన్ సంజు శాంసన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలకపోవడంతో రాజస్థాన్ తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయింది. దీనికి తోడు ఇన్ ఫామ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ (0) డకౌట్ కావడంతో 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
స్వల్ప స్కోరుకే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ జట్టు కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అన్న సందేహం కలిగింది. అయితే శివమ్ దూబే స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రియాన్ పరాగ్ అండతో దూబే బెంగళూరు బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు. పరాగ్ ఔట్ అయినా.. రాహుల్ తేవాతియాతో కలిసి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పి.. హాఫ్ సెంచరీ ముందు ఔట్ అయ్యాడు. చివరలో తెవాటియా బౌండరీలు బాదడంతో రాజస్థాన్ ఊహించని స్కోరు సాధించింది. ఆరంభంలో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన బెంగళూరు బౌలర్లు మధ్య ఓవర్లలో తేలిపోయారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు తీయగా.. జేమీసన్; రిచర్డ్‌సన్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.