
ముంబై: ఆట పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉండే అంకితభావం, సత్తాచాటాలన్న పట్టుదల తనలో ఉండాలని కోరుకుంటున్నట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్ దేవదత్ పడిక్కల్ చెప్పాడు. ఆర్సీబీ తరఫున కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌లతో కలిసి ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ మరో మూడు రోజులో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభం అయి మే 30తో ముగుస్తుంది. ఏప్రిల్ 9వ తేదీన బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కానుంది.
తాజాగా దేవదత్ పడిక్కల్ మాట్లాడుతూ... 'గతంతో పోల్చుకుంటే.. ఇప్పుడు బ్యాటింగ్‌లో చాలా పరిణతి సాధించా. ఇన్నింగ్స్‌ను నిర్మించడం, భారీగా పరుగులు రాబట్టడం నేర్చుకున్నా. గతేడాది బెంగళూరు తరఫున అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌లతో కలిసి ఆడటం గొప్ప గౌరవం. కోహ్లీ, డివిలియర్స్‌లు ఆడుతుంటే.. వారిని పరీక్షించా. ఆ ఇద్దరి నుంచి ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకున్నా' అని తెలిపాడు. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన పడిక్కల్.. 15 మ్యాచ్‌ల్లో 473 రన్స్ చేశాడు.
'ఆట పట్ల విరాట్ కోహ్లీకి ఉండే అంకితభావం, సత్తాచాటాలన్న పట్టుదల అద్భుతం. అతనికి స్ఫూర్తినివ్వడానికి మరొకరు అవసరం లేదు. కోహ్లీలో సత్తాచాటాలన్న విజయేచ్ఛకు కొదవలేదు. దేశం, జట్టు తరఫున అత్యుత్తమంగా ఆడాలనుకుంటాడు. ఈ లక్షాణాలన్నీ నాలో ఉండాలని కోరుకుంటున్నా' అని ఆర్సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2020లో బెంగళూరు తరఫున రాణించిన పడిక్కల్.. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ, విజయ్ హజారె వన్డే టోర్నీలో మెరిశాడు. విజయ్ హజారెలో 7 మ్యాచ్‌ల్లో 147.40 సగటుతో 737 పరుగులు రాబట్టాడు. వరుసగా 4 శతకాలు, 3 అర్ధ సెంచరీలు సాధించాడు.
ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన దేవదత్ పడిక్కల్ కోలుకున్నాడు. తాజాగా అతనికి నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ వచ్చింది. 24 గంటల అనంతరం నిర్వహించే మరో పరీక్షల్లో కూడా నెగటీవ్ వస్తే.. అహఁడు టీమ్ బయోబబుల్‌లో చేరనున్నాడు. అయితే ఈ విషయాన్ని ఆర్‌సీబీ టీమ్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆర్‌సీబీ టీమ్ సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాలు ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.