
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగినా.. బెంగళూరు పోరాటం ముందు ముంబై తలొంచింది. అయితే ఈ మ్యాచులో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి పెను ప్రమాదం తప్పింది. ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లీ కుడి కంటి కింది భాగంలో గాయమైంది. తృటిలో ప్రమాదం తప్పింది కానీ.. కొద్దిగా పైన తాకుంటే? ఊహించడానికే భయంగా ఉంది.
పేసర్ కైల్ జెమీషన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ముంబై ఆటగాడు కృనాల్ పాండ్యా బంతిని మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. సర్కిల్ బయట ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ ఆ బంతిని క్యాచ్‌గా అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే వేగంగా వచ్చిన బంతి అతని చేతి నుంచి బౌన్స్ అయి.. కోహ్లీ కంటి కింది భాగాన్ని తాకింది. వెంటనే కోహ్లీ కాసేపు తలకిందకి వంచడంతో.. ఏమైందో అని అందరూ కంగారు పడ్డారు. కోహ్లీ కంటికి బంతి బలంగా తాకిందేమో.. అనే సందేహం నెలకొంది. ఆ వెంటనే తేరుకున్న కోహ్లీ.. మళ్లీ ఫీల్డింగ్ చేశాడు.
అయితే విరాట్ కోహ్లీకి బంతి తగిలిన ప్రదేశంలో చిన్న వాపు కనిపించింది. విరాట్ మొహంపై గాయం స్పష్టంగా కనిపించింది. గాయాన్ని లెక్కచేయకుండా అతడు ఫీల్డింగ్ చేసి ఔరా అనిపించాడు. ఛేదనలో కోహ్లీ (33: 29 బంతుల్లో 4x4) విలువైన పరుగులు కూడా చేశాడు. పాండ్యా హిట్ చేసిన బంతి తక్కువ ఎత్తులో వచ్చినా.. కోహ్లీ రివర్స్ కప్ స్టయిల్‌లో క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించడమే పెద్ద తప్పిదమని మ్యాచ్ కామెంటేటర్లు పేర్కొన్నారు. బంతి శరీరంపైకి తక్కువ ఎత్తులో వస్తున్న సమయంలో రివర్స్ కప్ ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేసిన 33 పరుగులతో (2753) ఛేజింగ్‌లో అత్యధిక రన్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు రాబిన్ ఉత్తప్ప (2724) పేరిట ఉండేది. కోహ్లీ కెప్టెన్‌గా ఈ మ్యాచ్‌తో టీ20 ఫార్మాట్‌లో 6వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయి అందుకున్న తొలి కెప్టెన్ కూడా కోహ్లీనే. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో అర్ధ శతకం చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. డివిలియర్స్ (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లీ (33) రాణించారు.