IPL 2021 Phase 2: ఏదీ కలిసి రావట్లేదుగా: నో గ్లామర్: నో బెయిర్‌స్టో..నో బెన్‌స్టోక్స్

ముంబై: దేశంలో ప్రాణాంతక వైరస్ మహోత్పాన్ని సృష్టించడం ఆరంభమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్, 14వ ఎడిషన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) పెట్టిన ముహూర్తం ఏ మాత్రం కలిసి రావట్లేదు. విదేశీ స్టార్ క్రికెటర్లు దూరం కావడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ సెకెండ్ ఫేస్‌లో ఆడేది అనుమానమే. ఇక తాజాగా ఇంగ్లాండ్ కూడా డుమ్మా కొట్టబోతోంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఎంపికైన ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు లేనట్టే.

ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఫుల్ లిస్ట్..
ఐపీఎల్ టోర్నమెంట్‌లో గ్లామరస్‌గా మార్చడంలో విదేశీ ప్లేయర్ల పాత్రే అధికం. ఆసీస్, కివీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్ల బ్యాటింగ్.. బౌలింగ్..ఫీల్డింగ్ స్టంట్స్ ఈ మ్యాచ్‌లను అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా మార్చివేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున జానీ బెయిర్‌స్టో.. బ్యాటింగ్ ప్లస్ కీపింగ్ విన్యాసాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది. సన్‌రైజర్స్‌కే ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న జేసన్ రాయ్, ఇవాన్ మోర్గాన్-కోల్‌కత నైట్ రైడర్స్, సామ్ కుర్రన్, మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్, జోస్ బట్లర్, జోఫ్రా అర్చర్, లియాన్ లివింగ్‌స్టోన్-రాజస్థాన్ రాయల్స్, క్రిస్ వోక్స్, టామ్ కుర్రన్, సామ్ బిల్లింగ్స్-ఢిల్లీ కేపిటల్స్, డేవిడ్ మలన్, క్రిస్ జోర్డాన్-పంజాబ్ కింగ్స్ వీళ్లంతా ఐపీఎల్‌లో ఆడుతున్నారు.

డుమ్మా ఎందుకు?
ఫుల్ ప్యాక్డ్ క్రికెటింగ్ క్యాలెండర్‌ను ఎదుర్కొంటోంది ఇంగ్లాండ్ టీమ్. భారత్‌తో స్వదేశంలో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన వెంటనే ఆసియా ఉపఖండం పర్యటనకు వచ్చేస్తుంది. సెప్టెంబర్ 14వ తేదీ నాటికి భారత్‌తో చివరి టెస్ట్ ముగుస్తుంది. అదేనెల 19 లేదా 20వ తేదీన బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌ను ఆడుతుంది. బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్నతరువాత.. అటు నుంచి అటే పాకిస్తాన్‌తో సిరీస్ ఆడనుంది. సుమారుగా నెలరోజుల పాటు ఈ రెండు దేశాల్లో ఇంగ్లాండ్ జట్టు పర్యటించాల్సి ఉంది.

సెప్టెంబర్-అక్టోబర్‌లోనే
దాదాపుగా అదే సమయంలో ఐపీఎల్ ఫేస్ 2ను నిర్వహిస్తామంటూ బీసీసీఐ సూచనప్రాయంగా ప్రకటించింది. అటు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పర్యటనను వదులకుని ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లు.. ఐపీఎల్ 2021లో మిగిలిపోయిన మ్యాచ్‌లను ఆడటానికి రాకపోవచ్చని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ యాష్లే గిల్స్ తేల్చి చెప్పారు. ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ నుంచి ఎలాంటి విజ్ఞప్తి కూడా అందలేదని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ జాతీయ జట్టు లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌కు ఎంపిక కాలేకపోయిన ఆ దేశానికి చెందిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆటగాళ్లు ఇందులో పాల్గొనే అవకాశాలు లేకపోలేదు.

సగం టోర్నీ ఇంకా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల వల్ల ఈ ఐపీఎల్ సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ మినహా ఇందులో పాల్గొన్న ఫ్రాంఛైజీలన్నీ ఏడేడు మ్యాచ్‌ల చొప్పున ఆడేశాయి. ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడాయి. అంటే- సగం టోర్నీ ముగిసినట్టే. ఆయా జట్లన్నీ ఇంకా ఏడేడు మ్యాచ్‌ల చొప్పున ఆడాల్సి ఉంది. మిగిలిపోయిన మ్యాచ్‌లను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయంపై బీసీసీఐ అప్పట్లో ఏమీ తేల్చలేదు. ఇప్పుడు కూడా దానిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

రేపే భేటీ..
ఈ పరిణామాల మధ్య బీసీసీఐ శనివారం ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రాథమికంగా రూపొందించిన షెడ్యూల్‌పై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అటు ఆసీస్, ఇటు ఇంగ్లాండ్ ప్లేయర్లు దాదాపుగా దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడిన విషయాన్ని బీసీసీఐ పరిగణనలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా మళ్లీ షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చేస్తుందా? లేక ప్రాథమికంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటుందా? అనేది ఆసక్తి రేపుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications